తమిళ స్టార్ హీరో ధనుష్ ఇరుగు పొరుగు భాషల్లోను విజయాల్ని ఖాతాలో వేసుకుంటున్నాడు. రాంజానా చిత్రంతో బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టిన ధనుష్, తెలుగులో సర్, కుభేర చిత్రాలతో విజయాల్ని అందుకున్నాడు. ముఖ్యంగా అన్ని భాషల్లోను నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అతడు రెగ్యులర్‌గా తెలుగు దర్శకులు, నిర్మాతలను కలుస్తున్నాడు. వారి కథల్ని వింటున్నాడు.
ఎట్టకేలకు వేణు ఉడుగుల వినిపించిన స్క్రిప్టును ఫైనల్ చేసాడని తెలుస్తోంది. ధనుష్ కి ఇది తెలుగులో మూడో సినిమా. నీది నాది ఒకే కథ, విరాట పర్వం వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగులకు ఇది మరో అద్భుత అవకాశం.
ఈ సినిమాని వచ్చే ఏడాది పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటు దక్షిణాదిన తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తూనే, అటు హిందీలోను ధనుష్ దర్శకులను ఫైనల్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటడమే ధ్యేయంగా అతడు తెలివైన అడుగులు వేస్తున్నాడు.