జీవితంలో ఎవరికైనా పెళ్లి చాలా ప్రధానమైన ఘట్టం. పెళ్లి విషయమై యువతీ యువకులకు ఇంటి పోరు ఉండటం కూడా సహజం. అమెరికాలో స్టడీస్ పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చిన దుల్కార్ సల్మాన్ కి కూడా ఇలాంటి తిప్పలు తప్పలేదు. పెళ్లి చేసుకుని త్వరగా సెటిలవ్వాల్సిందిగా కుటుంబం ఒత్తిడి పెంచింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. కానీ అతడికి ఎవరూ నచ్చలేదు. దానికి కారణం తనకు బాగా తెలిసిన ఒక స్నేహితురాలి లాంటి అమ్మాయిని పెళ్లాడాలని అతడు అనుకున్నాడు.
ఆ తర్వాత ఎఫ్.బి లో తన స్కూల్ మేట్ అయిన అమల్ సూఫియాను చెన్నైలో కలిసాడు. అక్కడ అతడి రియల్ లవ్ స్టోరి ప్రారంభమైంది. మొదట అమల్ చాలా సందేహించింది.. తటపటాయించింది. కానీ చివరికి అతడు కాఫీకి పిలవగానే వచ్చింది. అక్కడ మాటలు కలిసాయి. గంటల తరబడి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒకరి మనసు ఒకరికి అర్థమైంది. మనసులు కలిసిన తర్వాత ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి పెళ్లాడేసారు. ఈ పెళ్లి కోసం దుల్కార్ కేరళ నుంచి చెన్నైకి రావడం ఒక ట్విస్ట్ అనుకుంటే, అమల్ సూఫియాతో ప్రేమలో పడటానికి చేసిన పనులు కూడా చాలా ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం ఈ జంటకు మరియం అనే కుమార్తె ఉంది.
అమల్ సూఫియా ఐదేళ్ల వయసు నుంచి దుల్కర్ కి క్లాస్ మేట్. కానీ స్కూల్ డేస్ లో ఎలాంటి క్రష్ లు లేవు. పెద్ద చదువుల కోసం దుల్కార్ అమెరికా వెళ్లిపోయాక విడిపోయారు. కానీ తిరిగి అతడు అమల్ ని వెతుక్కుంటూ చెన్నైకి వెళ్లాడు. అక్కడ అతడి లవ్ స్టోరి చాలా ఆసక్తికరంగా సాగింది. పెళ్లికి ముందు దుల్కార్ స్టార్ కానేకాదు. పెళ్లయిన తర్వాతే అన్నీ కలిసొచ్చాయి. ఈ విషయాన్ని అతడు చాలా సార్లు అంగీకరించాడు. దుల్కార్ నేడు దేశంలో పెద్ద హీరోలలో ఒకడిగా ఎదిగాడు. ఈ ప్రయాణానికి అతడి భార్య ఎంతగానో సహకరించింది. స్నేహితురాలిని పెళ్లాడితే అండర్ స్టాండింగ్ బావుంటుంది అనడానికి అతడు ఒక ఎగ్జాంపుల్.