చైనాతో భారత్ సత్సంబంధాల గురించి ఇటీవల మీడియా ఊదరగొడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బద్ధ శత్రువుగా మారడంతో, పొరుగున ఉన్న శత్రుదేశం చైనా విషయంలో భారత్ వైఖరి అమాంతం మారిపోయింది. ఇప్పుడు పట్టువిడుపు కనిపిస్తోంది. చైనాతో భారత్ జట్టు కట్టడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖంగు తిన్నాడు. ప్రపంచ రాజకీయ చిత్ర పటంలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి.
తాజా పరిణామంతో భారత్- చైనా మధ్య వ్యాపార సంబంధాలు మెరుగవ్వడమే గాక, ఎగుమతి దిగుమతులు ఇతరత్రా వ్యవహారాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఇకపై చైనా గూడ్స్ భారత్ లో ఇబ్బడి ముబ్బడిగా దిగిపోతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమయంలో చైనాలో విడుదలయ్యే భారతీయ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. చైనాలో సినీ నిర్మాణ- పంపిణీ సంస్థలు భారతీయ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తిని కనబరచడం కొత్త పరిణామం. ఇప్పుడు ప్రఖ్యాత చైనీ సినీనిర్మాణ సంస్థ (షాంఘై వైసి మీడియా అండ్ ఫిల్మ్) ఒక కొత్తతరం హీరో నటించిన భారతీయ సినిమాని చైనాలో 10వేల స్క్రీన్లలో విడుదల చేస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ట్వల్త్ ఫెయిల్ చిత్రాలను మించి `లవ్ ఇన్ వియత్నాం` భారీ స్క్రీన్లలో రిలీజవుతోంది.
బాలీవుడ్ లో చిన్న సినిమాల్లో నటించే శంతను మిశ్రా, అవ్ నీత్ కౌర్ లాంటి అంతగా పాపులారిటీ లేని తారలు నటించిన సినిమాని చైనీ డిస్ట్రిబ్యూటర్లు ఎంకరేజ్ చేస్తుండటం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. `లవ్ ఇన్ వియత్నాం` పేరుతో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రాన్ని చైనాలో అత్యంత భారీగా విడుదల చేయనుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈనెలలోనే ఈ చిత్రం భారతదేశంలోను విడుదల కానుంది.