కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రన్యారావుతో పాటు తెలుగు నటుడు తరుణ్ రాజ్, మరో ఇద్దరిని అప్పట్లో డిఆర్ఐ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. నటి రన్యారావు అండ్ సిండికేట్ పెద్ద ఎత్తున దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసారని, భారత్ సహా పలు దేశాలకు తరలించి వ్యాపార లావాదేవీలు నిర్వహించారని మీడియాలో కథనాలొచ్చాయి.
తాజా సమాచారం మేరకు.. డిఆర్ఐ అధికారులు నటి రన్యారావుకు 102 కోట్ల జరిమానా విధించారని, రన్యా 127 కేజీల బంగారం స్మగ్లింగ్ చేసినందుకు ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. తెలుగు నటుడు తరుణ్ రాజ్ 68 కేజీల బంగారం స్మగ్లింగ్ చేయగా 62 కోట్ల జరిమానా విధించారు. సాహిల్ జైన్, భారత్ జైన్ అనే మరో ఇద్దరికి 64 కేజీల బంగారం స్మగ్లింగ్ చేసినందుకు 53 కోట్ల మేర జరిమానా విధించారని కూడా తెలుస్తోంది. నలుగురికి కలిపి మొత్తం 270 కోట్ల జరిమానా విధించారు. ఈ జరిమానాలు చెల్లించకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
అయితే ఈ సిండికేట్ గ్యాంగ్ వందల కోట్ల విలువ చేసే వందల కేజీల బంగారం స్మగ్లింగ్ చేసారని ఇంతకుముందు మీడియాలో కథనాలొచ్చాయి. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జరిమానా విధించడం ఇదే మొదటిసారి. రన్యారావు అండ్ కో పేర్లు ఇప్పుడు మరోసారి మార్మోగుతున్నాయి. ఈ కేసులో అధికారులు 1200 పేజీల డాక్యుమెంటేషన్ చేయడం మరో సంచలనం. జరిమానాలు ఇంతటితో ముగియలేదు. అలాగే క్రిమినల్ కేసులను కూడా కొట్టేయలేదని అధికారులు తెలిపారు. రన్యారావు సహా ఇతరులపై జీవితాంతం ఈ కేసులు కొనసాగుతూనే ఉంటాయని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.