నేటి ఉదయం దివంగత నటుడు- నిర్మాత అల్లు రామలింగయ్య సతీమణి శ్రీమతి కనకరత్నం మృతి చెందారన్న వార్త టాలీవుడ్ లో విషాదం నింపింది. మెగా- అల్లు కుటుంబంలో ఇది తీవ్ర విషాద ఘట్టం. ఈరోజు కనకరత్నం గారి అంత్య క్రియల్లో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ ముందుండి ప్రతిదీ నడిపించారు. నాయనమ్మ అంత్యక్రియల్లో పాడె మోస్తూ అల్లు అర్జున్ కనిపించారు. చివరికి మెగా- అల్లు హీరోలు కనకరత్నం గారి పాడె మోస్తూ వారి రుణం తీర్చుకున్నారు.
కారణం ఏదైనా ఒక విషాద సమయంలో మెగా కుటుంబం- అల్లు కుటుంబం ఒక చోట కలిసి కనిపించారు. చాలా కాలం తర్వాత చరణ్ - బన్ని ఒకరికొకరు ఎదురు పడినప్పుడు ఎమోషనల్ గా ఒకరినొకరు హగ్ చేసుకోవడం కనిపించింది. ఓవరాల్ గా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య పొసగడం లేదు, ప్రత్యక్ష యుద్ధాలు నడుస్తున్నాయి! అంటూ ప్రచారం చేసేవారికి ఇది సరైన సమాధానంగా నిలుస్తుంది. ఇరు కుటుంబాల మధ్య కలతలున్నాయి! అంటూ బురద జల్లేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కానీ వీటికి వారు స్పందించకుండా పండగలు పబ్బాల సమయంలో కలవడం లేదా విషాద సమయాల్లో ఒకరికొకరు అండగా ఉన్నామన్న సిగ్నల్స్ పంపడం ద్వారా ప్రాక్టికల్ గా మాత్రమే దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. అనవసర ప్రచారాలకు టెంప్ట్ అవ్వకుండా, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తూ మెగా- అల్లు కుటుంబ హీరోలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టంలో దుఃఖంలో ముఖం చాటేసేవారు ఎప్పటికీ బంధువు లేదా ఆప్తుడు కాలేరు! సంతోషంలో మాత్రమే మేమున్నాం! అంటూ వచ్చేవాళ్లు ఎప్పటికీ స్నేహితులు కాలేరు!!