కెరీర్ ఆరంభం హిందీ సినిమాలతో నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నించిన జాన్వీకపూర్ వ్యూహాత్మకంగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడ వరుసగా అగ్ర హీరోల సరసన కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్ దేవర తర్వాత చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. `పెద్ది` తనకు మంచి పేరు తెస్తుందని, సౌత్ లో స్టార్ డమ్‌కి ఇది సహకరిస్తుందని జాన్వీ భావిస్తోంది.
ఇదే సమయంలో సౌత్ - నార్త్ క్రాస్ కల్చర్ నేపథ్యంలో రూపొందించిన పరమ్ సుందరి లో నటించింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా దిల్లీకి చెందిన యువకుడిగా నటించగా, కేరళ యువతిగా జాన్వీ నటించింది. దిల్లీ అబ్బాయి- కేరళ అమ్మాయి మధ్య ప్రేమకథ ఏ మలుపు తిరిగిందన్నదే ఈ సినిమా.
ఇటీవలే ట్రైలర్ విడుదలై వెబ్ లోకి దూసుకెళ్లింది. ఇందులో మలయాళీ అమ్మాయిగా నటించిన జాన్వీపై చాలా విమర్శలు వచ్చాయి. ఒక ఉత్తరాది అమ్మాయిని ఈ పాత్రకు ఎంపిక చేయడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. ముఖ్యంగా నటి కం గాయని పవిత్ర మీనన్ జాన్వీ ఎంపికను తప్పు పట్టారు. పలువురు యూట్యూబర్లు తప్పు పట్టడం చర్చగా మారింది.
అయితే అన్ని ప్రశ్నలకు జాన్వీ తెరపైనే సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న పరమ్ సుందరి థియేటర్లలో విడుదల కానుంది. తాను ఈ పాత్రను ఎంపిక చేసుకోవడానికి కారణం.. తాను, తన తల్లి మలయాళీలం కాకపోయినా, తమకు ఆ భూమితో అభిమానం ఉందని, ఒక మలయాళీ పాత్రలో నటించడం చాలా సరదాగా ఉంటుందని భావించినట్టు తెలిపింది. తాను మలయాళ చిత్రాలకు అభిమానిని అని కూడా జాన్వీ అన్నారు. నేను, అమ్మ మలయాళీలం కాదు. కానీ మలయాళ సంస్కృతి అంటే చాలా ఆసక్తి ఉందని జాన్వీ తెలిపింది. తుషార్ జలోటా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.