తనదైన అందం, వయ్యారంతో సమ్మోహనంలో ముంచెత్తడంలో నోరా ఫతేహి తర్వాతే. బాహుబలి మనోహరిగా సుపరిచితురాలైన ఈ మొరాకో బ్యూటీ బాలీవుడ్ టాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. నోరా అందచందాలు, నృత్యాలకు ఫిదా కాని కుర్రాడే లేడు. ఇప్పుడు నోరా ఫతేహికి డైహార్డ్ ఫ్యాన్ తన భార్య విషయంలో పెట్టిన కండిషన్ అందరికీ షాకిస్తోంది.
తన భార్య కూడా అచ్చం నోరాఫతేహిలా కనిపించాలని అతడు కోరుకున్నాడు. దీనికోసం రెగ్యులర్ గా 3గంటల పాటు జిమ్ లోనే గడపాలని భార్యను ఆజ్ఞాపించాడు. నోరా ఫతేహిలా రూపం స్మార్ట్ గా కనిపించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. అతడి కండిషన్స్ కి బెంబేలెత్తిన భార్య నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నోరా లా కనిపించాలని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడితో నలిగిపోతున్నానని, తన అత్త మామలు కూడా తనయుడికి మద్ధతునిచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు పరిష్కరించాల్సి ఉంది.
ఉత్తర ప్రదేశ్‌లోని మురాద్ నగర్‌లో జరిగిన ఈ ఘటన అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. 26 ఏళ్ల యువతి 28ఏళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ని పెళ్లాడగా, అతడి ఫిట్నెస్ పిచ్చి అందరికీ షాకిస్తోంది. 76 లక్షల కట్నం, స్కార్పియో అతడికి కానుకగా ఇచ్చామని వధువు చెబుతోంది. అయితే భర్త పిచ్చిపై నెటిజనులు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. నోరా ఫతేహి అంటే అంత పిచ్చి ఉన్నప్పుడు ఆమెనే పెళ్లాడాల్సింది! అంటూ పంచ్‌లు విసురుతున్నారు.