రష్మిక మందన్న కెరీర్ లో వరుస ప్రయోగాలతో దూసుకుపోతోంది. పుష్పలో శ్రీవల్లిగా, యానిమల్ లో గీతాంజలిగా అద్భుత నటనతో అలరించిన రష్మిక, తదుపరి మడోక్ ఫిలింస్ హారర్ థ్రిల్లర్ - `థామ`లో మరో ప్రయోగాత్మక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో `తడకా` అనే అపర శక్తిగా రష్మిక నటన మరో లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇది సినిమా ఆద్యంతం పాజిటివిటీ నింపే పాత్ర.
తాజాగా `థామ` నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ కొత్త లుక్ నిజానికి అందరినీ ఆశ్చర్యపరిచింది. రష్మిక ఇందులో క్రోధంతో రౌద్రరసం పండిస్తూ కనిపించింది. దీనిని బట్టి ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందోనని అభిమానులు ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో కారడివి, దూరంగా మంటలు, గిరిజనం ఎదురు చూపులు.. వగైరా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇది ఆత్మలు- దెయ్యాల కథల నేపథ్యంలో హారర్ థ్రిల్లర్. ఇందులో ఆయుష్మాన్ ఖురానా అలోక్ అనే పాత్రలో నటిస్తున్నాడు.
`ఇన్సానియత్ కి ఆఖ్రీ ఉమీద్` (మానవత్వానికి చివరి ఆశ) అనేది ట్యాగ్ లైన్. నవాజుద్దీన్ సిద్ధిఖీ `అంధేరే కా బాద్షా` (చీకటి రాజు)గా కనిపిస్తాడు. స్త్రీ 2 తో భారీ విజయాన్ని సాధించిన మడాక్ ఫిలింస్ లో రష్మిక మందన్న అవకాశం అందుకోవడం అదృష్టం. ఇప్పుడు స్త్రీ 2 తరహాలో కాకుండా మరో కొత్త హారర్ జానర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నటిగా తనకు మరింత గుర్తింపు తెస్తుందని రష్మిక భావిస్తోంది.