గదర్, గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్లలో నటించింది అమీషా పటేల్. తన దర్శకులతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఈ బ్యూటీ `గదర్ 2` రిలీజ్ సమయంలో దర్శకుడు అనీల్ శర్మతో బిగ్ ఫైట్ కి దిగింది. గదర్ 2 క్లైమాక్స్ ను తనకు తెలియకుండా మార్చేశారని, దాని వల్ల తాను చాలా మోసపోయానని అమీషా ఆరోపించింది. ఇకపై అలా జరగకుండా, గదర్: ఏక్ ప్రేమ్ కథ లాగా స్క్రిప్ట్ తనను ఎంతగానో ఉత్సాహపరిస్తేనే గదర్ 3 చేస్తానని అమీషా బహిరంగంగా చెప్పింది.
అయితే ఇప్పుడు అన్నిటికీ తూచ్ అనేసింది ఈ సీనియర్ నటి. ఇప్పుడు అమీషా మనసు మారింది. తాజా సమాచారం మేరకు.. అనిల్ శర్మతో అమీషా మంచి సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఓ హిందీ పోర్టల్ ఇంటర్వ్యూలో అనిల్ శర్మకు తనకు మధ్య సన్నివేశం మారిపోయిందని అమీషా తెలిపింది. కాలంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి. సకీనా (అమీషా పటేల్ పాత్ర పేరు) - తారా (సన్నీ డియోల్ పాత్ర పేరు) గదర్‌లో అంతర్భాగం. కానీ గదర్ 3 విడుదలకు ముందు సకీనా పాత్ర గురించి మరింత చర్చిస్తాము అని పేర్కొంది. `గదర్- 3` స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని కూడా అమీషా తెలిపింది.
స్క్రిప్టు రెడీ అయినా కానీ, ఈ సినిమా సెట్స్ కెళ్లేందుకు మరో రెండేళ్లు పడుతుందని కూడా వెల్లడించింది. ఈ మూడో భాగంలో తారా సింగ్ - అతని కుమారుడు జీతే సింగ్ (ఉత్కర్ష్ శర్మ పోషించిన పాత్ర) కథలను పూర్తి స్థాయిలో రివీల్ చేస్తారు. `ఓ మై గాడ్ 2`తో పోటీ పడినా కానీ, గదర్ 2 భారతదేశంలో రూ. 500 కోట్లకు పైగా నికర వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.