`ది బెంగాల్ ఫైల్స్` పేరుతో సినిమాని ప్రారంభించినప్పటి నుంచి నిరంతరం ఏవో సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఇప్పటికే చాలా ప్రయత్నించినా అది రిలీజ్ కావడం లేదు. అతడిపై రాజకీయ శత్రువులు కక్ష కట్టి పలు కేసులు దాఖలు చేయడంతో ఈ మూవీ రిలీజ్ ఇప్పటికి డైలమాలో పడింది. ది బెంగాల్ ఫైల్స్ ఎప్పుడు రిలీజవుతుందో ప్రస్తుతానికి కలకత్తా కాళికా మాతకే తెలియాలి.
1946లో ముస్లింలీగ్ అల్లర్లు, హిందువులపై జరిగిన దారుణాలను ఆపడంలో కీలక పాత్ర పోషించిన గోపాల్ ముఖర్జీ అనే ప్రముఖుని పాత్రను తప్పుగా చిత్రీకరించారంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి తాజాగా లీగల్ నోటీసులు అందాయి. తాత పాత్రను తప్పుగా చూపారంటూ ఆయన మనవడు శంతను ముఖర్జీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనికి కారణం ట్రైలర్‌లో గోపాల్ పథాను `ఏక్ థా కాషై గోపాల్ పథా`గా పరిచయం చేసారు. ఇది తన తాతను తప్పుగా చూపడమేనని శాంతను ఆరోపించారు. తన తాత వృత్తిరీత్యా కసాయి కాదని, మల్లయోధుడు, అనుశీలన్ సమితిలో కీలక వ్యక్తి అని శాంతను వెల్లడించాడు. 1946లో ముస్లిం లీగ్ అల్లర్లను నివారించడంలో కీలక పాత్ర పోషించిన తన తాత పాత్రను వక్రీకరించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ చట్టపరంగా ఆశ్రయించారు. పాత్ర చిత్రీకరణ తప్పుగా ఉండటమే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా బాధ కలిగించేలా ఉందని శాంతను ఆవేదన చెందారు.
నా తాతను కాషాయ్ (కసాయి) అని, పాఠా (మేక) అని పిలుస్తారా? ఇది గౌరవమేనా? అగ్నిహోత్రి ఆయనపై మరింత పరిశోధన చేయాల్సింది. కనీసం మమ్మల్ని సంప్రదించలేదు. అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నాం. లీగల్ నోటీసులు పంపాం. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసాము.. అని శంతను చెప్పారు. మా తాతగారు స్వాతంత్య్రోద్యమంలో భాగం. ఆయన భావజాలం నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పోలింది. ఆయన చాలా మంది ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి పనిచేశారు. ఆయనను కసాయి లేదా మేక అని ఎవరైనా ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించారు.
1946 ఆగస్టు 16న `ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం` పేరుతో ముస్లిం లీగ్ ప్రారంభించిన ఉద్యమం కోల్‌కతా (గతంలో కలకత్తా)లో వేలాది మంది హిందువుల మరణానికి దారితీసింది. భారత చరిత్రలో కీలకమైన సంఘటన అయిన `గ్రేట్ కలకత్తా మర్డర్స్` 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ వివాదం తలెత్తింది. ఇప్పటికే వివాదాస్పద కథాంశం కారణంగా దర్శకుడు అగ్నిహోత్రిపై డజను పైగా కేసులు నమోదయ్యాయి. తాజా కేసు వీటికి అదనం.