నేడు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్త్రీ శక్తి పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లి వద్ద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటి, విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ పాల్గొన్నారు. మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్ ఇచ్చి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వ గుర్తింపు కార్డు లలో ఆధార్ కార్డు కానీ, ఓటర్ గుర్తింపు కార్డ్ కానీ, లేదంటే రేషన్ కార్డ్ కానీ చూపించి మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని సాగించవచ్చు.
ఈ కార్యక్రమాన్ని ఆరంభించిన అనంతరం సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు ఉండవల్లి గుహల నుంచి విజయవాడ పీఎన్‌బీఎస్ సిటీ టెర్మినల్ వరకూ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. సీఎం, డిప్యూటీ సీఎం లకు కృతజ్ఞతలు తెలిపేందుకు కూటమి ప్రతి మహిళలు, ఇంకా సాధారణ మహిళలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా మంగళహారతులతో మంగళగిరి మహిళల ఘన స్వాగతం పలికారు