యంగ్ టైగర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత బారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ కి తెలుగులో మొదటి సినిమా కాగా, ఎన్టీఆర్ కి హిందీలో మొదటి సినిమా. పాన్ ఇండియాలో ఆ ఇద్దరూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన భారీ ప్రీరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్, హృతిక్ సందడి చేసిన సంగతి తెలిసిందే.
వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో తారక్ స్పీచ్ ఆద్యంతం రక్తి కట్టించింది. తన కుటుంబీకులు మొదలు, ఫ్యాన్స్, కెరీర్ ఆద్యంతం తనకు అండగా నిలిచిన దర్శకులు, సాంకేతిక నిపుణులు సహా వార్ 2 చిత్రబృందాన్ని , యష్ రాజ్ ఫిలింస్ కి చెందిన వ్యక్తులను కూడా ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. అయితే ఈ వేడుక ఇంత విజయవంతంగా కొనసాగడానికి కారకులైన పోలీస్ అధికారులు, అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వాన్ని యథాలాపంగా మర్చిపోయాడు.
అయితే జరిగిన తప్పును తెలుసుకున్న తారక్ ఈవెంట్ నుంచి వెళ్లిపోయాక ఒక వీడియోను రిలీజ్ చేసాడు. తమకు సహకరించిన అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ, వేదికపై వారిని మర్చిపోయినందుకు క్షమాపణలు చెప్పాడు. అయితే ఈ వీడియో చూడగానే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీఆర్ చాలా భయపడుతున్నాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకుముందు `పుష్ప2` వేదికపై తనను మర్చిపోయిన అల్లు అర్జున్ ని రేవంత్ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే వాదన వినిపించింది. అందుకే ఇప్పుడు తారక్ వెంటనే దానిని సరి చేసేందుకు వేచి చూడలేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంటనే క్షమాపణలు చెబుతూ వీడియోని రిలీజ్ చేయడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నించాడని ఊహిస్తున్నారు. అయితే ఇంత పెద్ద భారీ వేదికలపై అందరినీ గుర్తు చేసుకుని, పేరు పేరునా ధన్యవాదాలు చెప్పడం ఎవరికైనా అసాధ్యం. ముందే స్క్రిప్టు రాసుకుని వస్తే తప్ప!!