తెలుగు సినీపరిశ్రమకు ఇది చేస్తాం..అది చేస్తాం! అంటూ రాజకీయ నాయకులు ప్రకటనలు గుప్పిస్తుంటారు. జేబు నుంచి డబ్బు తీసి ఖర్చు చేస్తున్నట్టే ఫీలవుతారు. నిజానికి వినోదపరిశ్రమకు సంబంధించి రాజకీయ నాయకులు ఎలాంటి పెద్ద ప్రకటన చేసినా అది నీటి మూట లాంటిదని చాలాసార్లు ప్రూవైంది. ప్రత్యేక తెలంగాణ విభజన సమయంలో కేసీఆర్- కేటీఆర్ ప్రభుత్వం వినోద పరిశ్రమకు చాలా హామీలిచ్చింది. అప్పటి సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చాలా ప్రామిస్ లు చేసారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాజీపడకుండా కృషి చేస్తుందని పదే పదే మీటింగుల్లో ప్రగల్భాలు కూడా పలికారు. అధునాతన సాంకేతికతతో ఫిలింస్టూడియోలు నిర్మిస్తామని, కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తామని లేదా ఫిలింఇనిస్టిట్యూట్ లు నిర్మిస్తామని ప్రగతిశీల పరకటనలు చాలా చేసారు. కానీ ఆ మాటలన్నీ నీటి మూటలు అని ప్రూవైంది.
ముఖ్యంగా తెలంగాణ నుంచి వినోదరంగంలో ప్రయత్నించే చాలామంది ప్రతిభావంతుల కోసం తాము పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా ఒక ఇనిస్టిట్యూట్ ని తెస్తామని ప్రకటించారు. కొత్త రాష్ట్రాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా పలు దఫాలు పాలించినా ఈ కల నెరవేరలేదు. ప్రతిసారీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అదే పనిగా ఫిలింఇనిస్టిట్యూట్ నిర్మాణం గురించి ప్రస్థావించారు తప్ప ప్రయోజనం ఏదీ లేదు. తెలంగాణ- దోమకొండ సమీపంలో ప్రభుత్వమే పెద్ద పరిశ్రమను స్థాపిస్తుందని, దాని కోసం వందల ఎకరాలు కేటాయిస్తుందని వేదికలపై నాయకులు ప్రగల్భాలు పలికారు. గత ప్రభుత్వాల హయాంలో ఏదీ జరగలేదు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏల్తోంది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ వినోదపరిశ్రమ కోసం లేదా తెలంగాణ ట్యాలెంట్ కోసం ఏం చేసారు? అంటే ఇప్పటివరకూ ఎలాంటి ప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డుల పేరుతో పురస్కారాల్ని పునరుద్ధరించడం ప్రశంసనీయం. సినిమా టికెట్ ధరల పెంపునకు సహకరించడం ఆహ్వానించదగిన పరిణామాలు. అయితే ఇలాంటివి ఎవరు వచ్చినా చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా పాన్ వరల్డ్ రేంజుకు ఎదిగిన క్రమంలో హాలీవుడ్ రేంజును మించే టెక్నాలజీని హైదరాబాద్ కి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.
ప్రతిభను వెలికి తీసేందుకు అధునాతన ఎక్విప్ మెంట్ తో పని చేసే సాంకేతిక శిక్షణా సంస్థల్ని తేవాల్సి ఉంది. ముఖ్యంగా పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా ఒక ఇనిస్టిట్యూట్ ని నెలకొల్పి స్థానిక ప్రతిభావంతులను తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వాలు స్వీకరించాలి. ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి దీనిని అంతగా పట్టించుకుంటున్నట్టు కనిపించలేదని విమర్శలొస్తున్నాయి. ఇకనైనా తెలుగు సినిమా పురోభివృద్ధికి- హైదరాబాద్ ని అతి పెద్ద ప్రపంచ స్థాయి ఫిల్మీ హబ్ గా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు సాగుతాయో వేచి చూడాలి.