గడిచిన కొద్దిరోజులుగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో టాలీవుడ్ షూటింగులు గందరగోళంలో పడిన సంగతి తెలిసిందే. డెడ్ లైన్ల ప్రకారం సినిమాలను రిలీజ్ చేయడం కోసం శ్రమిస్తున్న చాలా మంది నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. 30శాతం వేతనాలు పెంచకపోతే సమ్మె విరమించేది లేదని కార్మిక ఫెడరేషన్ భీష్మించుకుంది. అయితే దీనికి అంగీకరించలేమని నిర్మాతలు అంటున్నారు.
తాజా సమాచారం మేరకు.. మధ్యే మార్గంగా సమస్యను పరిష్కరించుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెడరేషన్‌తో నిర్మాతలు చర్చా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే కార్మికుల డిమాండ్ మేరకు 30శాతం వేతనాలు పెంచడం అనేది జరిగే పని కాదని మాజీ ఫెడరేషన్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజా వ్యాఖ్యానించడం చర్చగా మారింది. ఇరు వర్గాలు ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్లు పెడుతున్న నిర్మాతలు హీరోలకు పెద్ద మొత్తాలు చెల్లిస్తారు.. మాకు భత్యం చెల్లించేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 30శాతం పెంచితే పెనుభారం అవుతుందని నిర్మాతలు అంటున్నారు.
అయితే ఎన్ని వందల కోట్లు పెడుతున్నారు అనేది కాదు.. అదుపు తప్పకుండా ఖర్చు చేయడమెలానో నిర్మాతలు గుర్తెరగాలి. ఒక్కో హీరోకి లేదా నటుడికి 10 మంది అసిస్టెంట్లు అవసరం లేదు. అలాంటి వృధా ఖర్చులు తగ్గించుకోవాలని నిర్మాతలకు సూచించారు తమ్మారెడ్డి.
జీవన వ్యయం పెరిగినప్పుడు వేతనాలు పెంచాల్సి ఉందని కూడా తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే అసంఘటిత రంగంలో ప్రతియేటా పెంచరు. నెలవారీ జీతగాళ్లకు మాత్రమే ప్రతి సంవత్సరం పెంచుతారని అన్నారు. సినిమా రంగం అసంఘటిత రంగం కాబట్టి ఇక్కడ జీతాలు పెంచరని అన్నారు. తాను ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా బంద్ లు జరిగాయని, చర్చించి పరిష్కరించుకునేవాళ్లమని కూడా తమ్మారెడ్డి అన్నారు.