పరిమిత బడ్జెట్లతో అత్యుత్తమ సినిమాలు తీయడమెలానో మలయాళ చిత్రసీమ ప్రతిసారీ నిరూపిస్తూనే ఉంది. దశాబ్ధాలుగా బడ్జెట్ అదుపు తప్పని సినిమాలు తీస్తూ అవార్డులు రివార్డులు కొల్లగొడుతోంది. ఇటీవలి కాలంలో కమర్షియల్ సక్సెస్ లను అందుకోవడంలోను ముందుంటోంది. అందుకే దేశంలోని అన్ని సినీపరిశ్రమలు మలయాళ చిత్రసీమను ఆదర్శంగా భావిస్తున్నాయి. ఇక్కడ పనితీరును కూడా పరిశీలిస్తున్నారు.
అయితే మాలీవుడ్ తో పోలిస్తే మనుకు నాలుగు రెట్లు అదనపు బడ్జెట్ ఖర్చవుతోందని అన్నారు తెలుగు నిర్మాత విశ్వప్రసాద్. పీపుల్స్ మీడియా పతాకంపై అగ్ర హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న విశ్వప్రసాద్ బడ్జెట్ ఎందుకు అదుపు తప్పుతోందో మాట్లాడారు. మాలీవుడ్ లో కోటి రూపాయకే పూర్తయ్యే సినిమా, మనకు 4కోట్లు ఖర్చవుతోందని, 4కోట్లలో అవ్వాల్సినదానికి 10-15 కోట్లు అవుతోందని వ్యాఖ్యానించారు.
ఇతర పరిశ్రమలతో పోలిస్తే తెలుగు చిత్రసీమలో కార్మికులకు వేతనాలు తీసికట్టుగా లేవని అన్నారు. సెట్లో 300 మంది పని చేస్తే అందులో సగం మందికి సాఫ్ట్ వేర్ తరహా వేతనాలు అందుతున్నాయి. మిగిలిన వారికి చెప్పుకోదగ్గ వేతనాలే చెల్లిస్తున్నాం. నేను ఫెడేరషన్ కి వ్యతిరేకిని కాను.. అయితే మీడియా ఎదుట మాట్లాడటం వల్ల నా పేరు ఎక్కువ వినిపిస్తోంది... అని విశ్వప్రసాద్ అన్నారు.