హీరోతో ఎఫైర్ అంటూ ఎవరైనా నటీమణి లేదా హీరోయిన్ గురించి పుకార్లు షికార్ చేయడం రొటీన్ గా చూస్తున్నదే. సినిమా వార్తల్లో గాసిప్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గత కొద్దిరోజులుగా ప్రముఖ కథానాయిక మృణాల్ ఠాకూర్ గురించి అలాంటి ఒక గాసిప్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. స్టార్ హీరో ధనుష్ తో అత్యంత చనువుగా ఉంటోందని, ఆ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కథనాలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ప్రచారాన్ని మృణాల్ తనదైన శైలిలో కొట్టిపారేసారు. ఏదైనా కథనం వేస్తే దానికి ఆధారాలుండాలని మృణాల్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను ఇలాంటి వాటిని పట్టించుకోనని అన్నారు. నేను నటించే సినిమాలు అయినా లేదా వ్యక్తిగత జీవితం అయినా అనవసర ప్రచారం కోరుకోను అని మృణాల్ వెల్లడించారు. తనపై ఇటీవల వస్తున్న వార్తలకు నియంత్రణ లేకుండా పోతోందని వాపోయారు. వార్తలు ప్రచురించే వాళ్లకు స్వీయనియంత్రణ అవసరం అని కూడా వ్యాఖ్యానించారు. సన్ ఆఫ్ సర్ధార్ 2 ప్రచార ఇంటర్వ్యూలలో మృణాల్ తనపై పుకార్లను ఖండించారు.
నేరుగా డేటింగ్ గురించి ప్రస్థావించకుండానే మీడియా అత్యుత్సాహాన్ని తూలనాడారు ఈ అందాల కథానాయిక. తెలుగు, తమిళం, హిందీలో వరుస చిత్రాలతో మృణాల్ బిజీగా ఉన్నారు. భార్య ఐశ్వర్యకు విడాకులిచ్చిన ధనుష్ ప్రస్తుతం ఒంటరిగా ఉన్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో మృణాల్ తో ముడిపెడుతూ తమిళ మీడియా వరుస కథనాలు అల్లుతోంది. అయితే ఈ వార్తల్ని ధనుష్ ఇప్పటివరకూ ఖండించలేదు. మృణాల్ పరోక్షంగా ఖండించింది.