30శాతం కార్మిక వేతన పెంపును డిమాండ్ చేస్తూ సినీకార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ మెరుపు సమ్మెతో నిర్మాతలు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చాలా సినిమాలకు ఇది ఇబ్బందికర పరిణామం. అయినా చాలా మంది అగ్ర నిర్మాతలు భత్యం పెంపు ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు. వేతన సవరణ చేసేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు. పైగా సినీపెద్దలను కలుస్తూ కార్మిక ఫెడరేషన్ పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. కొత్త ట్యాలెంటుకు రెడ్ కార్పెట్ వేస్తామంటూ అకస్మాత్తుగా కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది.
అయితే కార్మికుల సమస్య గురించిన ఓ ప్రకటనలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విషయం ఆశ్చర్యపరిచింది. కార్మికుల వేతనాల పెంపు సమర్థనీయమేనని ఆయన అభిప్రాయపడినట్టు కథనాలొస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో శ్రమ జీవుల జీవన వ్యయం పెరిగిందని కోమటిరెడ్డి అంగీకరించారు. తన దిల్లీ పర్యటన ముగించిన తర్వాత ఈ సమస్యపై దృష్టి సారిస్తానని ఆయన చెప్పారు. ఇక సమస్య మూలాలపై పరిశోధించేందుకు అగ్ర నిర్మాత దిల్ రాజును నియమించామని చెప్పడం ఆశ్చర్యపరిచింది. అయితే కార్మికుల భత్యం పెంచలేమని చెబుతున్న నిర్మాతల గిల్డ్ అధ్యక్షుడినే సమస్య పరిష్కారం కనుగొనమని నియమించడం హాస్యాస్పదంగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది
సమస్యపై చిరు ఏమన్నారంటే?
అయితే నిర్మాతల ఒత్తిళ్లకు తలొగ్గేందుకు ఈసారి ఫెడరేషన్ సిద్ధంగా లేదని తెలిసింది. ఈ మంగళవారం సాయంత్రం ఫెడరేషన్ పెద్దలతో మాట్లాడించేందుకు నేరుగా నిర్మాతలంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమస్యను చిరుకు విన్నవించారు. అయితే చిరు రెండు వైపులా వాదనలు విన్న తర్వాతే పరిష్కారం లభిస్తుందని వెల్లడించినట్టు నిర్మాత సి.కళ్యాణ్ మీడియాకు తెలిపారు. ముందుగా నిర్మాతల తరపున వెర్షన్ విన్న చిరంజీవి.. ఫెడరేషన్ ఇలా అర్థాంతరంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పట్టారు. కానీ అటువైపు నుంచి కూడా సమస్యను వినాలి కదా! అని అన్నట్టు తెలుస్తోంది. ఇరువైపులా సమస్య ఏమిటో అర్థమయ్యాకే తాను మాట్లాడతానని చిరంజీవి అన్నారని తెలిసింది.