తెలుగు చిత్రసీమను అవినీతి రోగం పట్టి పీడిస్తోందా? అంటే అవుననే నిపుణులు విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలు ఒకేసారి ఒకటికి మించిన ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాయి. దీని పర్యవసానం ఏక కాలంలో అన్ని ప్రాజెక్టులపై కంట్రోల్ కుదరడం లేదు. అందుకే కాస్ట్ కంట్రోల్ విషయంలో అదుపు తప్పుతున్నారనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఒకటికి మించి సినిమాలు చేస్తున్నప్పుడు నిర్మాతకు పూర్తిగా ప్రాజెక్టుపై అదుపు ఉండదు. పైగా స్టార్ హీరోలు, దర్శకులకు భారీ ప్యాకేజీలు, పారితోషికాలు అందించడానికి నిర్మాత ఎక్కువ ఒత్తిడిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇతర విభాగాలపై ఫోకస్ చేసేందుకు ఆస్కారం కనిపించదు.
అసలే సినీరంగంలో సక్సెస్ శాతం అంతంత మాత్రంగానే ఉండటంతో ఫైనాన్స్ చేసేవాళ్లు కూడా ఇటీవల తగ్గిపోతున్నారు. ఇది కూడా నిర్మాతలపై ఒత్తిడి పెంచే కారణం. సెట్స్ లో లేదా ప్రొడక్షన్ లో జరిగే అవినీతిని కనిపెట్టి పట్టుకోవాలంటే నిర్మాత పూర్తిగా ఆ ఒక్క ప్రాజెక్టుపైనే పూర్తిగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో మల్టిపుల్ ప్రాజెక్టులను నిర్వహించకూడదని కూడా విశ్లేషిస్తున్నారు. అలాగే షూటింగ్ ల సమయంలో సెట్స్ లో నమ్మకస్తులైన వ్యక్తులు ఉండాలి.
అలాగే నిర్మాతకు ప్రతి విషయాన్ని పారదర్శకంగా లెక్కలు చూపించే వ్యక్తులు చాలా అవసరం. ఎవరో ఒకరిని నమ్మి ప్రాజెక్టును కట్టబెట్టడం ఆత్మహత్యా సదృశం. అయితే నిర్మాతలు తమకు నమ్మకస్తులైన వ్యక్తుల్ని కనిపెట్టడం ఎలా? అయిన వారే మోసం చేస్తున్న ఈ రోజుల్లో, రక్త సంబంధీకులు కాని వారిని నమ్మడమెలా?