చెంప దెబ్బ కొట్టినప్పుడు తిరిగి ఎదురు చెంప దెబ్బ కొట్టడం సహజం. ఎటాక్ ప్రతి ఎటాక్ రెండూ ఉంటాయి. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు! ప్రస్తుతం ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ వ్యవహారం ఇలానే ఉంది. 30శాతం వేతన పెంపునకు ససేమిరా అంటున్న ఫిలింఛాంబర్- నిర్మాతల మండలి ఇకపై ఫెడరేషన్ తో మాట్లాడేందుకు సిద్ధంగా లేదు! అన్నట్టుగానే వ్యవహరిస్తోంది.
దీంతో ఇప్పటికే పెద్ద సినిమాల షూటింగులకు తీవ్ర అంతరాయం కలిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, బాలయ్య లాంటి పెద్ద హీరోల సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. వీటన్నిటికీ కార్మికుల నుంచి సమస్యలు తలెత్తాయని తెలిసింది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్మికులను బుజ్జగించి ప్రసన్నం చేసుకోవడానికి బదులుగా, హెచ్చరికలు జారీ చేస్తూ రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్ హాట్ టాపిగ్గా మారింది.
దీని ప్రకారం... ఫెడరేషన్ నుంచే కార్మికులను, వృత్తి నిపుణులను తీసుకోవాలనే నియమం లేదు. నైపుణ్యం ఉన్న ఎవరిని అయినా పనికి తీసుకోవచ్చు. అది బయటి వారైనా కావొచ్చనే వాదనను ఈ నోట్ లో తెరపైకి తెచ్చింది. దీనికి లేబర్ కమీషన్ అంగీకారం ఉందని కూడా కొత్త లా పాయింట్ ని బయటకు తీసింది ఫిలింఛాంబర్. ప్రతిదాడిని ఇంతటితో సరిపెట్టలేదు...ఫెడరేషన్ లో ఉన్న సంఘాలన్నీ మెంబర్ షిప్ పేరుతో లక్షల్లో కార్మికులను దోపిడీ చేస్తున్నాయంటూ పెద్ద నిందారోపణలు కూడా చేసింది ఛాంబర్. ఒకవేళ ఇదే నిజమైతే అసోసియేషన్ల యజమానులకు లెంపకాయ పడాల్సిందే!