తెలుగు చిత్రసీమలో నిర్మాతలకు వ్యతిరేకంగా కార్మికులు గళం విప్పుతున్నారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో పడిపోయిన 30శాతం వేతన పెంపును అమలు చేయాల్సిందిగా నిలదీస్తున్నారు. ఈ ఆదివారం సాయంత్రం నుంచి ఫెడరేషన్ తరపున ఒక అధికారిక లేఖ మీడియాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం... ఈ సోమవారం నుంచి షూటింగులు బంద్ చేస్తున్నామని ఫెడరేషన్ హెచ్చరించింది.
అయితే టాలీవుడ్ ఫిలింఛాంబర్ ఈరోజు అధికారికంగా కౌంటర్ ప్రకటనతో ఆశ్చర్యపరిచింది. వర్కర్స్ ఫెడరేషన్ కోరినట్లుగా వారి పక్షాన వేతనాలను పెంచుతూ ఎటువంటి లేఖలైనా జారీ చేయకూడదని ఫిలింఛాంబర్ అధికారికంగా ప్రకటించింది. ఫెడరేషన్ మీడియాకు విడుదల చేసిన లేఖకు సంబంధించి ఏవైనా వివరాల కోసం తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ని సంప్రదించాలని కోరుతూ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు గౌరవ కార్యదర్శి దామోదర ప్రసాద్ ఒక సందేశాన్ని అందించారు.
అంతేకాదు సినీకార్మికులకు వేతన పెంపును తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకరించలేదని కూడా ఈ ప్రకటనలో వెల్లడించడం షాకిచ్చింది. దీంతో ఫెడరేషన్ డిమాండ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పినట్టయింది. సినీకార్మికులు సమ్మెకు సైరన్ మోగించారా లేదా? అనేదానిపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.