తెలుగు చిత్రసీమలో కార్మిక ఫెడరేషన్ మెరుపు సమ్మె కాకలు పుట్టిస్తోంది. ఈ సోమవారం నుంచి కార్మికుల సహాయనిరాకరణతో ఎక్కడి షూటింగులు అక్కడ నిలిచిపోనున్నాయి. చాలా సంవత్సరాలుగా 30శాతం భత్యం పెంపు కోసం డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు దానికి ససేమిరా అంటున్నారు. దీంతో కార్మికులు విధిగా సమ్మెకు దిగుతున్నారని ఫెడరేషన్ చెబుతోంది.
అయితే ఇలా సడెన్ గా నిర్ణయం ప్రకటించడం వల్ల చాలా షూటింగులకు అంతరాయం కలుగుతుందని, దీంతో కార్మికుల సమస్య పరిష్కారం కాదని అగ్ర నిర్మాత సి.కళ్యాణ్ ఫైర్ అవుతున్నారు. కార్మిక ఫెడరేషన్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ``ఇటువంటి ఒత్తిడి వ్యూహాలు అన్యాయం. ఇది నిర్మాతలకు చావో రేవో తేల్చుకోమని చెప్పడమే. ఇది పరిశ్రమకు ఆరోగ్యకరమైనది కాదు`` అని సి కళ్యాణ్ మండిపడ్డారు.
వేతనాలు సాంప్రదాయకంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సవరించాలి. కానీ ఈసారి నిర్మాతలకు మరింత సమయం అవసరం. పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోంది. థియేటర్ ఆదాయాలు బాగా పడిపోయాయి. పెద్ద నిర్మాతలు, స్టార్లు షూటింగులు ఆపేస్తే నెలల తరబడి కార్మికులు జీవించగలరా? అని కూడా కళ్యాణ్ ప్రశ్నించారు. హెచ్చరికలు జారీ చేయడం కాదు.. మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని కూడా సి.కళ్యాణ్ సూచించారు.