ప్రయోగాత్మక ఆలోచనలు.. వైవిధ్యమైన కథల ఎంపిక.. 24 శాఖలతో పనిని రాబట్టుకునే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు .. వెరసి ప్రశాంత్ వర్మ- ది గ్రేట్. నేటితరం దర్శకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపిస్తూ, తెలుగు సినిమా భవిష్యత్ కి ఇంకా తాను అందించేది చాలా ఉందని ప్రామిస్ చేస్తున్న పనిమంతుడు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ లో మొదటి ప్రయత్నమే అతడు అసాధారణ విజయం సాధించాడు. తేజ సజ్జా లాంటి ఒక అప్ కమింగ్ హీరోతో `హనుమాన్` లాంటి భారీ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించిన ప్రశాంత్ ఇప్పుడు రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ, AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్) విభాగాల్లో హనుమాన్ జాతీయ అవార్డులను గెలుచుకుంది. జాతీయ అవార్డుల జూరీ హనుమాన్ పై ఇంతగా ఫోకస్ చేసింది అంటే అతడు ఏ స్థాయిలో ఔట్ పుట్ తీసుకున్నాడో గమనించి తీరాలి.
ముఖ్యంగా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించిన `హనుమాన్`కి అత్యుత్తమ నాణ్యతతో వీఎఫ్ఎక్స్ పనిని రాబట్టాడు. అయితే ఇది ఎలా సాధ్యం? అంటే.. ఇలాంటి వాటికి డబ్బుతో పని కాదు. నిపుణులకు అవసరమైన సమయం కేటాయించాలని చెప్పాడు ప్రశాంత్. వారికి తగిన సమయం ఇస్తే, మనకు కావాల్సిన మంచి ఔట్ పుట్ ఇవ్వగలరని, తొందర పెడితే మంచి ఫలితం రాబట్టలేమని అసలు లాజిక్ చెప్పాడు. గతంలో రుద్రమదేవి సహా చాలా సినిమాలకు చెత్త వీఎఫ్ఎక్స్ పనిని రాబట్టారు.
ఎన్టీఆర్- హృతిక్ `వార్ 2` కోసం ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ పైనా విమర్శలొస్తున్నాయి. కానీ హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మ రాబట్టుకున్న విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై ఎలాంటి విమర్శలు రాలేదు. అది అతడు సాధించిన గొప్ప విజయం. అతడి నుంచి వస్తున్న జై హనుమాన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.