క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ఇటీవల తన భార్య ధనశ్రీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. వైఫ్ ధనశ్రీతో విభేధాల కారణంగా చాహల్ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు. అతడు మోసగాడు అంటూ నిరంతరం సోషల్ మీడియాల్లో ఎటాక్ చేయడంతో దానికి తాను మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని చాహల్ ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించారు. తనకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని చాహల్ షాకింగ్ విషయాన్ని బహిర్గతం చేసాడు. మానసికంగా కుంగిపోయాను.. తప్పుడు మనిషి అనడం తట్టుకోలేకపోయానని చాహల్ తెలిపారు. తాను సోదరీమణులు, తల్లితో పాటు కలిసి పెరిగానని, అందువల్ల స్త్రీల గౌరవం గురించి తెలుసునని అన్నారు.
ఆ కఠిన సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి.. రోజుకు 2గంటలు మాత్రమే నిదురించేవాడిని.. ఇలాంటి పరిస్థితి 40-45 రోజుల పాటు కొనసాగిందని చాహల్ తెలిపారు. తాను నమ్మినవారి కోసం ప్రాణం పెట్టేస్తానని, మోసగాడు అంటే తట్టుకోలేకపోయానని చాహల్ అన్నారు. నేను ఎవరినీ డిమాండ్ చేయను.. అందరికీ ఇచ్చేవాడిని.. అని అన్నారు. కొన్ని మీడియాలు నాపై తప్పుడు కథనాలు ప్రచురించాయి... రేటింగుల కోసం నన్ను పావుగా వాడుకున్నాయని చాహల్ అన్నారు. తనను ఎవరితో అయినా ముడిపెట్టి రాస్తే, అది కేవలం టీర్పీల కోసమేనని కూడా అతడు అన్నాడు.
ఓవైపు క్రికెటర్ గా వైఫల్యాలను ఎదుర్కొన్న చాహల్ కి, అదే సమయంలో కొరియోగ్రాఫర్ వైఫ్ తో బ్రేకప్ కారణంగా మరింత మానసిక ఆవేదన ఎదురైంది. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల నుంచి అతడు బయటపడుతున్నాడు. అయితే ఆర్జే మహ్‌వాష్ పేరును మాత్రం అతడు ఈ పాడ్ కాస్ట్ లో ప్రస్థావించలేదు. 2020 డిసెంబర్ లో ఈ జంట పెళ్లి కాగా, 20 మార్చి 2025 నాటికి అధికారికంగా విడిపోయారు.