సినీరంగంలో చాలా ఒడిదుడుకులను తట్టుకుంటేనే నిలబడగలరు. ముఖ్యంగా డబ్బు పెట్టే నిర్మాత ఆర్థికంగా నష్టపోయినా తట్టుకుని నిలబడే గుండె ధైర్యంతో ఉండాలి. అలా కాకుండా డబ్బు నష్టపోగానే దిగాలు పడిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దిగులు, ఒంటరితనం, విరక్తి వంటి వాటి కారణంగా డిప్రెషన్ లోకి వెళితే తిరిగి కోలుకోవాలంటే చాలా కష్టం.
అయితే అలాంటి డిప్రెషన్ కారణంగానే హిందీ నిర్మాత, నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారని కథనాలొచ్చాయి. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పదే పదే ఆత్మహత్య చేసుకోవాలనుందని చెప్పేవారట. ఆ విషయాన్ని జయసుధ పెద్ద కుమారుడు నిహార్ కపూర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాన్నకు ఆరోగ్యం అంతంత మాత్రమే. చిన్న వయసులోనే సుగర్ వ్యాధి వెంటాడింది. ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. దీనికి తోడు నాన్నగారికి ఎందులోను కలిసి రాలేదు. సినిమా నిర్మాతగా నష్టాలొచ్చాయి. కోర్టు కేసులు వెంటాడాయి. ఒక ప్రాజెక్ట్ ప్రారంభించిన వెంటనే ఆగిపోయింది. మరో ప్రాజెక్టును బాలీవుడ్ నిర్మాత లాక్కున్నారు. కేసులు పెడితే ఫైట్ చేసే ఓపిక లేదు. ఎదుటివారి బలం ముందు మనం ఏదీ చేయలేమనే నిరాశ. వెరసి ఇవన్నీ ఆయనను మరింత డీప్‌గా డిప్రెషన్‌లోకి తీసుకెళ్లాయని నిహార్ తెలిపారు.
ఒకరోజు అకస్మాత్తుగా ఆయన ఏడంతస్తుల భవంతి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆయన తన అమ్మ గారి ఇంట్లో ఉన్నారు ఆ సమయంలో. భవంతి పైనుంచి దూకేయడంతో స్పాట్ లో చనిపోయారు. ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో ఉన్నపుడు పదే పదే అనేవారు.. ఆయన అన్నంత పనీ చేసారు! అని నిహార్ నాటి ఘటన గురించి వెల్లడించారు. నితిన్ కపూర్ ప్రముఖ నిర్మాత జీతేంద్ర కజిన్. ఆయన మరణించి ఇప్పటికే దశాబ్ధం పైగా అయింది. అయినా ఇప్పటికీ నాటి ఘటన ఆ కుటుంబాన్ని గాయంలా వేధిస్తూనే ఉంది.