విజయ్ దేవరకొండ గడిచిన నాలుగైదేళ్లుగా చాలా ఎమోషన్స్ ని అనుభవించాడు. నటించిన సినిమాలేవీ ఆశించిన విజయాల్ని సాధించలేదు. ఎంత శ్రమించినా ఫలితం శూన్యం. ఖుషి -ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు నిరాశపరిచాయి. అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ అలాంటి హంగామా లేకపోవడంతో చాలా నీరసించిపోయాడు. ఇలాంటి సమయంలో ఎన్నో హోప్స్ పెట్టుకున్న కింగ్ డమ్ వస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాలో అతడి రూపం, ఆహార్యం ఇప్పటికే అంచనాల్ని పెంచాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను తిరుపతిలో ప్లాన్ చేయడమే కాకుండా, దేవరకొండ లోకల్ సీమ యాసను మాట్లాడేందుకు ప్రయత్నించడం ఆసక్తిని కలిగించింది.
ఈ వేదికపై దేవరకొండ మాట్లాడుతూ- పాణం పెట్టేసి సినిమా చేసానని అన్నాడు. తిరుమలేశుని ఆశీస్సులు, అండదండలు తనతో ఉంటే చాలు.. కచ్ఛితంగా పోయి టాప్ లో కూచుంటానని ధీమాను వ్యక్తం చేసాడు. కింగ్ డమ్ సినిమాని ఈ నెలాఖరున థియేటర్లకు వచ్చి ఆదరించమని తన అభిమానులను విజయ్ కోరాడు. ఇక ఇదే ఈవెంట్లో కచ్ఛితంగా కొత్త రకం యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామాను అందిస్తున్నమని, ఇది రెండున్నరేళ్ల కష్టమని నిర్మాత నాగవంశీ అన్నారు.
అయితే వేడుక ముగుస్తున్నా యూట్యూబ్ లో ట్రైలర్ అప్ లోడ్ కాలేదు. శనివారం రాత్రి 10.30 తర్వాతే చెన్నై నుంచి ట్రైలర్ యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతుందని నాగవంశీ ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. తిరుపతిలో జరిగిన వేడుకలో నాగవంశీ, అనిరుధ్, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.