తన సొంత ఇంట్లోనే తాను వేధింపులకు గురవుతున్నానని కన్నీరు మున్నీరవుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన నటి తనూశ్రీ దత్తా, ఈరోజు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడానికి వెళుతున్నానని ప్రకటించడం షాకిచ్చింది. తాను పనిమనిషి కారణంగా వేధింపులకు గురవుతున్నానని తనూశ్రీ ఆరోపించింది. నాపై రహస్య శోధన చేయడానికి ఎవరో ఈ పనిమనిషిని నియమించారని, 2018 మీటూ సమయం నుంచి నన్ను వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని తనూశ్రీ ఆరోపించడం హాట్ టాపిగ్గా మారింది.
నా ఇంట్లోనే వేధిస్తున్నారు.. నాకు ఆరోగ్యం బాలేదు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో జరిగినట్లే తనను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తనూశ్రీ షాకింగ్ ఆరోపణలు చేసింది. అయితే తనూశ్రీ ఎప్పటిలాగే కొత్త స్కీమ్ ఏదో ప్లాన్ చేసిందని నెటిజనులు విరుచుకుపడుతున్నారు. తనూశ్రీ బూటకపు కన్నీళ్లను నమ్మొద్దని కొందరు షాకింగ్ ప్రత్యారోపణలు చేసారు. అయితే తనూశ్రీ కన్నీరు మున్నీరవుతున్న వీడియో ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అయింది.
నా ఇంట్లో పనిమనిషిని బలవంతంగా నియమించారు. దానివల్ల నాకు నేను సొంతంగా పనిమనిషిని కూడా నియమించుకోలేను. పనిమనిషితో చాలా చెడు అనుభవం ఎదురైంది. వాళ్ళు వచ్చి నా ఇంట్లోని వస్తువులను దొంగిలించారు. నా పనులన్నీ నేనే చేయాలి. నా ఇంట్లోనే నేను ఇబ్బంది పడుతున్నాను. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి! అంటూ తీవ్రంగా ఆరోపించింది. ``సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాగానే, నన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి`` అని అన్నారు. బాలీవుడ్ మాఫియా ఈ ప్రయత్నాలు చేస్తోంది. నాకు భద్రత కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.. అని పేర్కొంది. ఈ మాఫియా చాలా పెద్దది .. ప్రమాదకరమైనది. సుశాంత్ సింగ్ లాగానే నా ప్రాణాలను కాపాడుకోలేక నేను భయపడుతున్నాను.. అని తనూశ్రీ వెల్లడించారు.
నన్ను నిరంతరం ఫాలో అవుతున్నారు.. వేధిస్తున్నారు. నాపై నిఘా పెట్టడానికి నా ఇంట్లో ఒక పనిమనిషిని ఉంచారని తనూశ్రీ ఆరోపించింది. నానా పటేకర్ పై ఆరోపించిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని తనూశ్రీ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.