మోహిత్ సూరి తెరకెక్కించిన `సయ్యారా` ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డులకెక్కుతోంది. హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, రణబీర్, వరుణ్ ధావన్, జునైద్ ఖాన్, .. ఇంకా ఎందరో నటవారసులకు దక్కని అరుదైన రికార్డును అందుకుంటున్నాడు అహాన్ పాండే. ఖాన్‌లు, కపూర్ ల కుటుంబానికి చెందని అతడు పాండే కుటుంబానికి గొప్ప గౌరవం, గుర్తింపును తెచ్చాడు. సయ్యారా చిత్రం అతడిని ఓవర్ నైట్ స్టార్ గా ఆవిష్కరించింది.
ప్రస్తుతం ఏ నోట విన్నా అహాన్ పేరే వినపడుతోంది. ఇటీవలి కాలంలో అంతటి వేవ్ వేరొకటి లేదు. అహాన్ తో పాటు ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అనీతా పద్దాకు కూడా మంచి పేరొచ్చింది. ఆసక్తికరంగా అహాన్ ని ఆడిషన్స్ లో ఎంపిక చేసుకున్నా కానీ, అతడి ప్రదర్శన తనకు నచ్చలేదని నిర్మొహమాటంగా మోహిత్ సూరి తన నిర్మాత ఆదిత్య చోప్రాకు చెప్పేసారట. కానీ ఆది మాత్రం అహాన్ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఆడిషన్స్ లో అహాన్ బ్లాక్ బస్టర్ సినిమాల్లోంచి అద్భుతమైన సీన్లను ఎంపిక చేసుకుని వాటిలో నటించాడు. కానీ ఇవేవీ మోహిత్ సూరిని మెప్పించలేదు. డైరెక్టుగా సెట్లో తమ పాత్రల్లో జీవించడమే అసలైన నటన! అని దర్శకుడు సూరి భావించాడట. కానీ అహాన్ తన శ్రద్ధ, హార్డ్ వర్క్ తో మెప్పించాడని మోహిత్ సూరి చెప్పారు.
ఇక `సయ్యారా` చిత్రంలో కథానాయికగా నటించిన అనితా పద్దా తొలుత ఒక వీడియోను పంపింది. అందులో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత వైఆర్ఎఫ్ కాస్టింగ్ ఏజెంట్ తనను ఆడిషన్స్ చేసి ఓకే చేసారు. పద్దా సహజసిద్ధంగా అద్భుతంగా నటించిందని కాస్టింగ్ ఏజెంట్ కితాబిచ్చారట. సయ్యారా విడుదలైన నాలుగు రోజులకే 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఇది అసాధారణ విజయం.