సినిమా అనేది కళా ప్రక్రియ. కళను కళగా చూడాలి తప్ప పెడార్థాలు తీయకూడదు. కుల మత ఘర్షణలు, మనోభావాలు దెబ్బ తిన్నాయని చెప్పడం, ఇతరత్రా విద్వేషాగ్ని ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైపోవడం ఆందోళన కరంగా మారింది. చాలా సినిమాలను క్రియేటర్లు తాము ఎలా చూపించాలనుకుంటున్నారో అలా స్వేచ్ఛగా చూపించలేని దుస్థితి ఇటీవలి కాలంలో దాపురించింది. అనురాగ్ కశ్యప్ వంటి దర్శకుడు తన సృజనాత్మకతను వందశాతం ప్రదర్శించాలనుకుంటే, ఇతర ప్రపంచం సరిగా అర్థం చేసుకోలేదని తీవ్రంగా కలత చెందారు. ఈ ఆవేదన కారణంగానే బాలీవుడ్ వదిలి ఎటో వెళ్లిపోయారు.
ఇప్పుడు బ్యాడ్ గర్ల్ సినిమాకి మద్ధతు పలికిన అనురాగ్ కశ్యప్, వేట్రి మారన్ లాంటి ఫిలింమేకర్స్ పరిస్థితి కూడా అలాగే దయనీయంగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఈ ఇద్దరూ సమర్పకులుగా కొత్త దర్శకులు వర్ష భరత్ ని పరిచయం చేస్తూ వారు రూపొందించిన బ్యాడ్ గర్ల్ చిత్రం ఇటీవల కోర్టు వివాదం కారణంగా చర్చల్లోకొచ్చింది. ఈ సినిమాలో బ్రాహ్మణ యువతిని ప్రధాన పాత్రలో చూపించారు. టీనేజీ యువతి చెడ్డ పనులను టీజర్ లో చూపించారు. ఇది బ్రాహ్మణులను కించపరచడమేనని తొలుత వివాదం చెలరేగింది. ఆ తర్వాత టీనేజర్లను అసహ్యకరంగా చూపించారని ఆరోపిస్తూ దీనిపై కోర్టులో పిల్ దాఖలైంది. అయితే మద్రాస్ హైకోర్టు- మధురై బెంచ్ తన విచారణ అనంతరం అభ్యంతరకరంగా ఉన్న మూవీ టీజర్‌ని అంతర్జాలం నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఓవైపు వివాదం ఇలా ఉంటే, ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం యుఏ సర్టిఫికెట్ ని ఇచ్చారు. సెప్టెంబర్ 5న బ్యాడ్ గర్ల్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ పురస్కారాలు దక్కినా, ఇండియాలో రిలీజ్ మ్యాటర్ లో చాలా ఇబ్బంది పడుతోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్రలో నటించింది.