మలయాళంలో వచ్చిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ చిత్రంలో కథానాయకుడు కాగా, తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ ఈ ఫ్రాంఛైజీ రీమేక్ హీరోలుగా కొనసాగుతున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ లో దృశ్యం 3 ని ప్రారంభించేందుకు మలయాళ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ సన్నాహకాల్లో ఉన్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లో మూడో భాగంపైనా ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. అయితే జీతూ కంటే ముందే హిందీ వెర్షన్ ని ప్రారంభించాలని అజయ్ దేవగన్ బృందం ప్రయత్నించిందని, అయితే దీనికి జీతూ ససేమిరా అన్నారని తెలుస్తోంది. జీతూ జోసెఫ్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో దృశ్యం 3 గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికే క్లైమాక్స్ ని కూడా సిద్ధం చేసానని, దీనికోసం తెల్లవారు ఝామున కూడా నిదుర లేచానని తెలిపాడు.
అయితే మలయాళ వెర్షన్ కంటే ముందే హిందీ వెర్షన్ ని ప్రారంభిస్తామని చిత్ర నిర్మాత, నటుడు దేవగన్ అన్నారు.. కానీ అది కుదరదని చెప్పాను. ఒకవేళ అలా చేస్తే చట్టబద్ధంగా చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పానని జీతూ తెలిపారు. దీంతో హిందీ నిర్మాతలు ఈ ప్రాజెక్టును నిలిపివేసారు. ఇప్పుడు మలయాళ వెర్షన్ అక్టోబర్ లో ప్రారంభమవుతుంది కాబట్టి, హిందీ నిర్మాతలకు కూడా లైన్ క్లియరైనట్టే. అయితే హిందీ వెర్షన్ క్లైమాక్స్ వేరు, మలయాళ వెర్షన్ క్లైమాక్స్ వేరుగా చూపిస్తారా? అన్నదానిపై జీతూ క్లారిటీ ఇవ్వలేదు. దృశ్యం 3 తెలుగు వెర్షన్ లో వెంకీ నటిస్తున్న సంగతి తెలిసిందే.