స్టంట్ డూపింగ్ లేదా స్టంట్ అసిస్టెంట్ జాబ్ ఎంతో రిస్కుతో కూడుకున్నది. స్టంట్ మన్ కి ఏదైనా అయితే ఆ కుటుంబానికి దిక్కెవరు? కానీ అలాంటి కాంప్లికేషన్ ఉన్నా కానీ, ఇప్పటికీ స్టంట్ ఆర్టిస్టులకు సరైన ప్రమాద బీమా, ఆరోగ్య బీమా భరోసాను కల్పించే నిర్మాణ సంస్థలు అరుదు. కారణం ఏదైనా కానీ ఇటీవల స్టార్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కిస్తున్న ఓ తమిళ సినిమా సెట్లో జరిగిన ప్రమాదంలో ఫైట్ మాస్టర్ రాజు ఎస్ఎం మృతి చెందడంపై చాలా ఆందోళన నెలకొంది. కార్ ఛేజ్ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రాజు డ్రైవ్ చేస్తున్న కార్ గాల్లో ఎగిరి ఫల్టీలు కొట్టింది. ఆ దృశ్యం గగుర్పాటుకు గురి చేసింది. యాక్సిడెంట్ కారణంగా రాజు మృతి చెందాడు.
ఈ ఘటనలో దర్శకుడు పా రంజిత్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇలాంటి సమయంలో స్టంట్ ఆర్టిస్టులకు ప్రమాద- ఆరోగ్య బీమా కల్పిస్తూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీసుకున్న ఇనిషియేషన్ సర్వత్రా చర్చగా మారింది. బాలీవుడ్ లో పని చేస్తున్న దాదాపు 650-700 మంది స్టంట్ ఆర్టిస్టులకు అక్షయ్ బీమా సౌకర్యం కల్పించారు. వారికి ఇప్పటికే ఇన్సూరెన్స్ చేసేందుకు అవసరమైన ఫార్మాలిటీస్ ని పూర్తి చేస్తున్నారని సమాచారం. అక్షయ్ తీసుకున్న ఈ చొరవతో స్టంట్ ఆర్టిస్టుల కుటుంబీకులకు కొంత భరోసా లభించింది.
అయితే స్టంట్ ఆర్టిస్టు ఎస్.ఎం.రాజు పరిస్థితి ఇతరులకు రాకుండా ఉండాలంటే, సెట్లో భద్రతా నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రోటోకాల్ ని ఫిలింమేకర్స్ అనుసరించాలి. ఇలాంటి విషయాల్లో మేకర్స్ అశ్రద్ధ ఆర్టిస్టుల ప్రాణాల్ని బలిగొంటోందని విశ్లేషిస్తున్నారు.