వల్లభనేని వంశీ రీసెంట్ గానే బెయిల్ పై బయటికొచ్చారు. ఆయన టీడీపీ ఆఫీస్ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో హైదరాబాద్ లో ఏపీ పోలీసులకు చిక్కడంతో ఆయనపై చాలానే కేసులు నమోదు అయ్యాయి. టీడీపీ ఆఫీస్ పై దాడి, నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో బెయిల్ రాక వంశీ చాలా నెలలు జైలులో ఉన్నారు.
మధ్యలో ఆరోగ్యం పాడవగా జైలు అధికారులు వంశీ కి గుంటూరు GGH లో వైద్య పరిక్షలు చేయించారు. ముందు నుంచి అన్ని కేసుల్లో బెయిల్ రాగా.. చివరికి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలతో ఇళ్లను పంపిణీ చేశారన్న కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే తమ వాదన వినకుండా.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోకుండా.. తాము ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించకుండానే హైకోర్టు వల్లభనేని వంశీ కి బెయిల్ ఇచ్చిందని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ప్రభుత్వం తరుపు లాయర్ వాదనలను పరిశీలనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. ప్రభుత్వం తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని.. అలాంటిది అసలు వాదనలే వినకుండా.. ఒక వ్యక్తికి బెయిల్ ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు హైకోర్టును ప్రశ్నించింది. వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నించింది. ఇంతకుముందు వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని వ్యాఖ్యానించింది.
అయితే ప్రభుత్వం తరపు లాయర్ వంశీ ని మరోసారి అరెస్ట్ చేసి విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరగా.. ఆ వాదనను కూడా పక్కన పెట్టి.. కేసులో మిగతా వాదనలు వినిపించాలని, నెల రోజుల్లో మరోసారి ప్రభుత్వ వాదనలు విని.. మరోసారి తీర్పు చెప్పాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.