వరుసగా పాన్ ఇండియా హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ రష్మిక మందన్న దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కియరా అద్వాణీ, జాన్వీ కపూర్ సహా పలువురు యువ నాయికల నుంచి పోటీ ఉన్నా కానీ, రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత అల్లు అర్జున్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి పెద్ద స్టార్ల సినిమాల్లో అవకాశాల్ని అందుకుంది. ప్రతి ప్రాజెక్టులో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ నటిగా అందరి దృష్టిలో పడింది. ఇప్పటికిప్పుడు రష్మిక క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో బిజీగా ఉంది.
మరోవైపు రష్మిక తర్వాత ఆ స్థాయిలోనే అవకాశాల్ని అందుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది ట్రిప్తి దిమ్రీ. సందీప్ వంగా యానిమల్ చిత్రంతో ఈ బ్యూటీ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన `స్పిరిట్` మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ అవకాశం నిజంగా ఒక మిరాకిల్. స్పిరిట్ నుంచి దీపిక ఎగ్జిట్ తర్వాత అనూహ్యంగా సందీప్ వంగా ట్రిప్తీని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటికే పద్మావత్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలో నటించిన షాహిద్ సరసనా ఈ బ్యూటీ నటిస్తోంది.
ఇప్పుడు ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సరసన నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది. మరోవైపు హృతిక్ రోషన్ `క్రిష్ 4`లో ఓ కీలక పాత్రలో ట్రిప్తి నటించే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి హృతిక్ బ్రాండ్ హెచ్.ఆర్.ఎక్స్ ప్రకటనలో నటించిన ట్రిప్తి గ్రీక్ గాడ్ కి బాగా క్లోజ్ అయిపోయిందని, ఇక అవకాశాలు వెల్లువెత్తడం ఖాయమేనని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.