సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కూలీ` ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రివ్యూ వీక్షించిన రజనీకాంత్ మరో `దళపతి` చూసినట్టుగా ఉందని లోకేష్ పై ప్రశంసలు కురిపించారట. ఇదే విషయాన్ని వెల్లడించిన లోకేష్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ , శ్రుతి హాసన్ లాంటి టాప్ స్టార్లు నటించారు. బాలీవుడ్ ఐకాన్ అమీర్ ఖాన్ అతిధి పాత్రలో నటించారు. పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశ పనులను కూడా ఇటీవలే ముగించారు. లోకేష్ మాట్లాడుతూ-``డబ్బింగ్ స్టూడియోలో సినిమా చూసిన తర్వాత రజనీ సర్ నన్ను కౌగిలించుకుని ``ఇది నాకు దళపతిలా అనిపించింది!`` అని అన్నారు. ఆ రోజు నా టైమ్ మారిపోయింది. ఆ రోజు రాత్రి నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. నేను నా స్నేహితులకు కూడా అదే చెబుతున్నాను. నేను రజనీ సర్ తో సినిమా చేస్తే అది `దళపతి`కి దగ్గరగా ఉండాలి.
మణి సర్ నాణ్యతతో సమానమైన సినిమా రాయలేను.. ఎందుకంటే ఆయన సినిమాలు, రచనా శైలి సాటిలేనివి కానీ ఆ సినిమాను ఈ సినిమాతో పోల్చినప్పుడు నాకు కొంచెం సంతృప్తి కలుగుతుంది. రజనీ సర్ నుండి అవే మాటలు వినడం ఒక విజయం`` అని అన్నాడు. దళపతి తనకు ఎప్పుడూ ఇష్టమైన రజనీ సినిమా అని, కూలీ కూడా ఇదే విధమైన శైలి, సారాన్ని కలిగి ఉంటుందని లోకేశ్ అన్నారు. కూలీ కంటే ముందే రజనీకాంత్ సర్ కి ఒక ఫాంటసీ కథ చెప్పానని అది ఒక రూపం తీసుకోవడానికి చాలా సమయం పట్టిందని కూడా తెలిపారు.
`దళపతి` అప్పట్లోనే పెద్ద మల్టీస్టారర్. రజనీకాంత్ - మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించారు. ఒంటరి అయిన తనను చేరదీసిన వ్యక్తి కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు వెనకాడని ఒక స్నేహితుడి కథతో మణిరత్నం దళపతి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు `కూలీ`లో కూడా అలాంటి గొప్ప పాత్రలతో ఎమోషనల్ థ్రిల్లర్ ని అందిస్తున్నాడు లోకేష్. లోకేష్ నాటి మేటి క్లాసిక్ ని తలపించేలా కూలీలో ఎమోషన్స్ ని పండిస్తే ఇది బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.