ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి తో టాలీవుడ్ మొత్తం కన్నీళ్లు పెడుతుంది. విలక్షణ నటుడిగా పేరున్న కోట శ్రీనివాస రావు విలన్ పాత్రలు, హాస్య పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎందులోనైనా ఒదిగిపోయేవారు. వయోభారంతో కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఫిలిం నగర్ లో తన ఇంట్లోనే కన్నుమూశారు.
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోట మృతితో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజెయ్యడమే కాదు.. మెగాస్టార్ చిరు, బ్రహ్మానందం లాంటి వారు కోట ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళు అర్పిస్తున్నారు.
కమెడియన్ బ్రహ్మానందం కోట భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. 40 ఏళ్లుగా ఇద్దరం అరెయ్, ఒరేయ్ అంటూ మాట్లాడుకున్నాం.. ఒక రోజులో మేమిద్దరం కలిసి 18-20 గంటల పాటు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నటనకి ఎప్పటికీ ఒక కోట నా కోట శ్రీనివాసరావు.. ఆయన ఇప్పుడు లేడంటే నమ్మలేకపోతున్నా అంటూ బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యారు.