టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయింది. తెలుగు సినిమా పరిశ్రమలో విలన్ గాను, ఇతర పాత్రలతోను తెలుగు ప్రేక్షక హృదయాల్లో తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలో ఈరోజు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కోటా శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు ప్రసాద్ 2010 లో రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. అప్పట్నుంచి కోట శ్రీనివాసరావు కుంగి పోయారు.
కోట శ్రీనివాసరావు దాదాపుగా ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. విలన్ పాత్రకు కోట శ్రీనివాసరావు కొత్త అర్ధం చెప్పారు. ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు. అగ్రహీరోలు సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ వంటి పాత, కొత్తతరం నటులతో కలిసి ఆయన పని చేసారు.
విలన్ పాత్రలు మాత్రమే కాదు.. అహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు లోని కామెడీ యాంగిల్ ని జంధ్యాల వెలికితీసారు. కోట మృతి చెందడంతో సినీ, రాజకీయనాయకులు సంతాపం తెలుపుతున్నారు.