అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన `జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ` వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీబీఎఫ్ సి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రిలీజ్ తేదీ వాయిదా పడింది. ఈ మూవీ టైటిల్ నుంచి జానకి పేరును తొలగించాలని, సినిమా నుంచి కూడా ఈ పేరు తొలగించాలని డిమాండ్ ఎదురైంది. అయితే జానకి పేరును తొలగించడం కుదరదని నిర్మాత పట్టుబట్టారు. దీంతో రిలీజ్ తేదీ వాయిదా పడటమే కాకుండా, కోర్టుల పరిధిలో దీనిపై విచారణ సాగుతోంది.
ఇప్పటికి ఇంకా ఈ సినిమా కొత్త రిలీజ్ తేదీ కన్ఫామ్ కాలేదు. అయితే తమ సినిమాకి ఇంత పెద్ద చిక్కుల్లో పడటానికి కారణం.. ఎల్ 2 ఎంపూరన్ లాంటి భారీ సినిమానే అని నిర్మాత సురేష్ కుమార్ అన్నారు. మా సినిమా రిలీజవుతున్న సమయంలోనే ఎల్ 2 ఎంపూరన్ సెన్సార్ గడపపై వివాదంలో ఇరుక్కుంది. దీంతో సెన్సార్ సభ్యులు ప్రతి సినిమాని జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెట్టారు.
అలా మా సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుందని అన్నారు. ఎంకి చావు సుబ్బికొచ్చిన చందంగా.. తమ పరిస్థితి అయోమయంగా మారిందని నిర్మాత అన్నారు. టైటిల్ లో జానకి అనే హిందూ పేరును ఉపయోగించి మనోభావాలను దెబ్బ తీసారని అనుపమ సినిమాపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.