ఒకసారి నేము ఫేము వచ్చేస్తే చాలు ఆ తర్వాత డబ్బే డబ్బు. అయితే దీనిని ప్రతిభ, హార్డ్ వర్క్‌తో సాధించుకుంది సాయిపల్లవి. భారతదేశంలో అద్భుతమైన డ్యాన్సింగ్ క్వీన్ గా గుర్తింపు పొందిన సాయిపల్లవి నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రలను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది.
ఇది తన కెరీర్ లో అరుదైన అవకాశం. రామాయణం పార్ట్ 1, రామాయణం పార్ట్ 2 రెండిటిలోను సీతగా సాయిపల్లవి నటిస్తోంది. అయితే రెండు సినిమాల ఫ్రాంఛైజీ కోసం సాయిపల్లవికి ఎంత ప్యాకేజీ అందుతోందో తెలుసా? ఒక్కో భాగానికి 6 కోట్లు చొప్పున, రెండు భాగాలకు ఏక మొత్తంగా 12 కోట్ల పారితోషికం అందుకుంటోందని సమాచారం. నిజంగా ఇది చాలా గొప్ప అవకాశం. దాదాపు 1600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నందుకు రణబీర్ కపూర్ ఏకంగా 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. రెండు భాగాలకు కలిపి ఇంత పెద్ద మొత్తం ముడుతోంది. ఇక విదేశీ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్లు, నేపథ్య సంగీతం అందించే హాలీవుడ్ టెక్నీషియన్లు, సంగీతం అందిస్తున్న రెహమాన్ కు అత్యంత భారీ పారితోషికాలు ముడుతున్నాయి. మొదటి భాగాన్ని 900కోట్లు, రెండో భాగాన్ని 700 కోట్లతో తెరకెక్కించనున్నారని ఇప్పటికే కథనాలొచ్చాయి.
కేజీఎఫ్ సంచలనం యష్ ఇందులో రావణుడిగా నటిస్తుండగా, అతడు ఈ ప్రాజెక్ట్‌లో సహ నిర్మాతగా చేరాడు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో కలిసి యష్ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకుడు. రామాయణం: పార్ట్ 1 దీపావళి 2026 సందర్భంగా విడుదల అవుతుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా విడుదల అవుతుంది.