దేశవ్యాప్తంగా పామాయిల్ వినియోగం అసాధారణంగా ఉంది. ముఖ్యంగా తెలుగింట పామాయిల్ వినియోగం గురించి చెప్పనవసరం లేదు. రెగ్యులర్ గా వంటల్లో ఉపయోగించేది పామాయిల్ మాత్రమే. ఇక సంక్రాంతి పండగ వస్తే టిన్నుల కొద్దీ పామాయిల్ ని పండగ స్పెషల్ వంటకాల కోసం ఉపయోగిస్తారు. అయితే దేశ ప్రజల జీవనవిధానంలో ఇంతగా అల్లుకుపోయిన పామాయిల్ తింటే విషం తిన్నట్టేనని, ఇది ఆత్మహత్యా సదృశమని చెబుతున్నారు రకుల్ ప్రీత్- జాకీ భగ్నానీ జంట.
అసలు వంటకాల కోసం పామాయిల్ వినియోగించ కూడదని, నెయ్యి లేదా కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించాలని కోరుతోంది ఈ జంట. పామాయిల్ తినడం వల్ల సర్వరోగాలు వస్తాయి. ఫ్యాటీ కొవ్వులు పెరిగి గుండెపోటు, పిల్లలు పుట్టకపోవడం, కిడ్నీ సమస్యలు, నరాల సంబంధిత రుగ్మతలు వగైరా వగైరా గిఫ్ట్ గా అందుతాయని అందువల్ల తక్షణం పామాయిల్ ని వదిలించుకోవాలని వైద్యులు సూచించారని, తాము దీని ప్రకారం వంట నూనెలో మార్పులు చేసుకున్నామని తెలిపారు.
ఇటీవలే యోగా డే రోజున ఫిట్ ఇండియా కపుల్ గా పురస్కారం అందుకున్న రకుల్ - జాకీ భగ్నానీ జంట స్వయంగా చెబుతున్నారు కాబట్టి నేటి నుంచి నెయ్యి లేదా కొబ్బరి నూనెను మాత్రమే తెలుగు ప్రజలు తమ వంటకాల్లో వినియోగించే ప్రయత్నం చేస్తే మంచిది. మన రైతులు పండించిన పంటలపై మితిమీరిన ఎరువులు, రసాయనాల వాడకం పెను ప్రమాదంగా మారింది. అందువల్ల సొంతంగా పండించినవి మాత్రమే తినాలని కూడా ఈ జంట సూచిస్తున్నారు.