నితీష్ తివారీ `రామాయణం` హైప్ చూస్తుంటే ఆషామాషీగా లేదు. భారతదేశంలో ఇప్పటివరకూ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఏకైక సినిమా ఇదే అంటూ హంగామా సృష్టిస్తోంది పీఆర్ టీమ్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 800 కోట్ల బడ్జెట్ కేటాయించారంటూ మొదట ప్రచారమైంది. 2.0- ఆర్.ఆర్.ఆర్- బాహుబలి- సలార్, పుష్ప 2, కల్కి 2898 ఏడి కంటే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిదని ప్రచారమైంది. 2026 దీపావళికి మొదటి భాగం విడుదల కానుండగా, 2027 దీపావళికి రెండో భాగం విడుదలవుతుందని కథనాలొచ్చాయి.
అయితే ఇంతలోనే ఇప్పుడు ఈ సినిమా కాన్వాస్ మరింత పెద్దదిగా మారిందన్న ప్రచారం ఊపందుకుంది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేతలైన టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ కోసం భారీ బడ్జెట్లను ఖర్చు చేస్తున్నారని ప్రచార హంగామా మొదలైంది. అంతేకాదు.. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ ఫ్రాంఛైజీ చిత్రానికి ఏకంగా 1600 కోట్ల బడ్జెట్ ఖర్చవుతోందని, మొదటి భాగానికి 900 కోట్లు, రెండో భాగానికి 700 కోట్లు ఖర్చు చేస్తారని ప్రచారం సాగుతోంది. మొదటి భాగం కోసం భారీ సెట్లు వేస్తారు కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ ఖర్చవుతోంది. రెండో భాగానికి మొదటి భాగం కోసం వేసిన సెట్లను ఉపయోగించుకుంటారు కాబట్టి 200 కోట్ల వరకూ బడ్జెట్ తగ్గుతుందని కూడా ఒక కథనం వెలువడింది.
నిజానికి ఇంత పెద్ద బడ్జెట్ వెచ్చిస్తున్నారు? అంటే దేనికోసమో సరైన వివరణ ఇవ్వాలి. అలాంటి క్లారిటీ ఇప్పటివరకూ `రామాయణం` టీమ్ నుంచి లేదు. కాబట్టి హైప్ క్రియేట్ చేయడానికి పీఆర్ టీమ్ చేస్తున్న హంగామా ఇదని అర్థం చేసుకోవచ్చు. దక్షిణాదిన భారీ మొత్తానికి రైట్స్ అమ్మేయాలంటే ఆ మాత్రం జిమ్మిక్కులు చేయాలి కదా!