`దంగల్` ఫేం నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పురాణేతిహాస కథను లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో అత్యంత భారీగా తెరకెక్కించేందుకు నితీష్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి, ఆంజనేయుడిగా సన్నీడియోల్, రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ప్రముఖ తారలు నటిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈ క్రేజీ ఆఫర్ మొదట టాలీవుడ్ స్టార్‌హీరో మహేష్ ని వరించిందని కథనాలొస్తున్నాయి. నితీష్ బృందం శ్రీరాముడి పాత్రను ఆఫర్ చేస్తూ మహేష్ ని సంప్రదించింది. ఇందులో నటించేందుకు మహేష్ కూడా చాలా ఆసక్తిని కనబరిచారు. కానీ చివరికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా కోసం మహేష్ దానిని తిరస్కరించాల్సిన పరిస్థితి తలెత్తింది. జక్కన్నకు అప్పటికే కాల్షీట్లు ఇచ్చేయడంతో నితీష్ మూవీ కోసం సమయం కేటాయించలేని పరిస్థితి ఉంది.
అలా మహేష్ రామాయణం ఆఫర్ ని వదులుకున్నారు. అయితే మహేష్ నో చెప్పాక నితీష్ తివారీ వెంటనే రణబీర్ కపూర్ ని శ్రీరాముడి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత కథంతా తెలిసిందే. బాహుబలి ఫ్రాంఛైజీ సహా ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియాలో గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో రాజమౌళికి ఉన్న క్రేజ్ వేరే లెవల్ లో ఉంది. అందువల్ల కూడా రాజమౌళితో సినిమా చేసే అవకాశాన్ని వదులుకునేందుకు మహేష్ ఆసక్తిని కనబరచలేదన్నమాట.