ఒకప్పుడు 500 ఎకరాల భూస్వామి. 5 ఎకరాల్లో ఒక పెద్ద బంగ్లానే ఉండేది. ఈ ఆస్తుల విలువ ఇప్పటి మార్కెట్ ప్రకారం 250-500 కోట్లు. కానీ ఇప్పుడు ఆస్తులన్నీ కరిగిపోయి చివరికి చెన్నైలో అద్దె ఇంటికి షిఫ్టవ్వాల్సిన దుస్థితి తలెత్తింది. అయితే ఈ నటుడి ఆస్తులన్నీ అలా కరిగిపోవడానికి కారణం అప్పులు. అప్పులు చేసి సినిమాలు తీయడం.. వాటిని తీర్చడం కోసం ఆస్తులు అమ్మడం. చివరికి విధి ఉన్నవన్నీ కరిగించింది. ఒకరకంగా ఉన్న ఊరిని వదిలి ఉపాధి కోసం పట్టణానికి షిఫ్టవ్వాల్సిన స్థితి వచ్చింది.
ఇదంతా ఎవరి గురించి అంటే.. ప్రముఖ తమిళ హాస్యనటుడు సత్యన్ గురించి. దళపతి విజయ్, జీవా లాంటి స్టార్లతో కలిసి సత్యన్ `స్నేహితుడా` చిత్రంలో నటించాడు. ఇందులో స్నేహితుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. సత్యన్ ఒకప్పుడు హీరో. కానీ ఇప్పుడు హాస్య నటుడు. ఇప్పటివరకు 70 చిత్రాల్లో నటించాడు. నన్బన్, తుప్పాకి (తుపాకి), నవీన సరస్వతి శబతం వంటి సినిమాలు అతడికి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టాయి. విజయ్ నటించిన నన్బన్, తుప్పాకి చిత్రాలలో అతడి పాత్రలు బాగా పేరు తెచ్చాయి. నేడు సత్యన్ తమిళ సినిమాల్లో ప్రముఖ హాస్యనటుడు.. కానీ అతడి నేపథ్యం గురించి తెలుసుకుంటే నోరెళ్లబెడతారు. సత్యన్ ఒక భూస్వామి కుమారుడు. కోయంబత్తూరు జిల్లాలోని ఒక పాపులర్ సిటీ మాధంపట్టిలో ఉండేవాడు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అతడికి ఉన్నాయి. చారిత్రాత్మకంగా వారి కుటుంబం ఒక చిన్న రాజ్యాన్ని పోలి ఉంటుంది. సత్యన్ మాధంపట్టి శివకుమార్ ఏకైక కుమారుడు. మాధంపట్టిలోని వారి బంగ్లా ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది. వారికి ఒకప్పుడు వందల ఎకరాల తోటలు, ఆస్తులు ఉన్నాయి.
ఒకప్పుడు సంపదకు పేరుగాంచిన మాధంపట్టి కుటుంబం, వారి ఆస్తులన్నింటినీ అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే మాధంపట్టి శివకుమార్ కు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆయనకు ప్రముఖ తమిళ నటులు మార్కండేయన్ శివకుమార్ , సత్యరాజ్ లతో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. సత్యరాజ్ తన అత్త కుమారుడు. సత్యరాజ్ సినిమాల్లోకి రావడాన్ని కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించినా కానీ, పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు శివకుమార్. తరువాత, మాధంపట్టి శివకుమార్ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు, ఇది ఆర్థిక నష్టాలకు దారితీసింది. దాంతో తమ ఆస్తులను అమ్మడం ప్రారంభించారు. ఒకానొక సమయంలో మాధంపట్టి శివకుమార్ తన కుమారుడు సత్యన్ కథానాయకుడిగా `ఇళయవన్` చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీని ఫలితంగా మరింత ఆర్థిక నష్టాలుతో ఆస్తులు అమ్ముకున్నారు.
మాధంపట్టి శివకుమార్ మరణం తరువాత, నటుడు సత్యన్ కొన్నేళ్ల క్రితం మాధంపట్టిలోని తమ బంగ్లాను అమ్మేసి చెన్నైకి మకాం మార్చాడు. ఒకప్పుడు మాధంపట్టి స్థానికులు కుట్టి రాజా అని ముద్దుగా పిలిచే సత్యన్ ఇప్పుడు తన పూర్వీకుల ఆస్తులన్నింటినీ అమ్మేసాడు. తన స్వస్థలానికి వెళ్లడం మానేసాడు.