కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో జైలు కెళ్లాక తన పట్ల తన ఫ్యామిలీ నడుచుకున్న తీరు, తను జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు తన కోసం నిలబడలేదు అనే కోపం బాగా ఉంది. అందులోను అన్న కేటీఆర్ పై, బావ హరీష్ రావు పై కవిత కు పీకలదాకా కోపముంది. తండ్రి కేసీఆర్ తో అన్నను పక్కనపెట్టిద్దామంటే కేసీఆర్ అన్నవైపే స్టాండ్ తీసుకుంటున్నారు. అందుకే కవిత కాంగ్రెస్ లో కలుస్తుందా, లేదంటే కొత్త పార్టీ పెట్టినా షాకవ్వక్కర్లేదు అనుకున్నారు.
కానీ కవిత మాత్రం కొత్త పార్టీ పెట్టను, బీఆర్ఎస్ నా పార్టీ నే, మా నాన్న కోసం పని చేస్తాను అంటూ తెగేసి చెప్పినా.. కవిత చేసే పనులు కొన్ని బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు తలనెప్పి తెచ్చిపెట్టేదిలా ఉండడమే ప్రాణసంకటంగా మారింది. కేటీఆర్ పై కవిత డైరెక్ట్ ఎటాక్ చెయ్యకపోయినా కోల్డ్ వార్ అయితే ఇద్దరి నడుమ నడుస్తుంది.
తాజాగా బీఆర్ఎస్ కు నచ్చని మీడియా ఛానల్ కి కవిత ఇంటర్వ్యూ ఇవ్వడమే హాట్ టాపిక్ అంటే.. తను జైలుకెళ్ళినప్పుడు తనపై వచ్చిన మీమ్స్ ని, ట్రోల్స్ ని తమ పార్టీ వారు తిప్పికొట్టలేదని, తనపై కేసు పెట్టినప్పటి నుంచే వాటిని తిప్పి కొట్టేలా చెయ్యాలని తన తండ్రిని రిక్వెస్ట్ చేసినా ఎందుకో పట్టించుకోలేదు అంటూ కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
తన తండ్రి కేసీఆర్ భోళా శంకరుడు, అలాంటి ఫోన్ ట్యాపింగ్స్ చిల్లరపనులు ఆయన చెయ్యరు, కానీ ఆయన కింద ఉన్నవాళ్లు చేసి ఉండొచ్చు అంటూ కేటిఆర్ పేరెత్తకుండా ఆయనపై అనుమానం కలిగేలా కవిత మాట్లాడింది. అంతేకాదు ఏపీలో షర్మిల అన్న జగన్ తో పోరాడేది ఆస్తికోసం, కానీ నేను ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను అంటూ కేటీఆర్ పై ఆమె అక్కసు వెళ్లగక్కింది.