గత కొన్ని నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న వల్లభనేని వంశీ కి కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ పార్టీ ఆఫీస్ ఉద్యోగి సత్యమూర్తి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ గచ్చిబౌలి లోని తన నివాసంలో అరెస్ట్ అయ్యి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న వంశీ పై పలు కేసులు నమోదు అయ్యాయి.
టీడీపీ ఆఫీస్ పై దాడి, ఆ తర్వాత నకిలీ ఇళ్లపట్టాల కేసు ఇలా వంశీ కి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్ అంటూ వంశి జైలుకే పరిమితమయ్యారు. జైలులో ఉన్నప్పుడే వల్లభనేని వంశీకి ఆరోగ్యం పాడవగా ఆయనకు విజయవాడ ఆయుష్ లో చికిత్స అందించమని పోలీసులకు కోర్టు ఆర్డర్ వేసింది.
తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండుసార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులు విధించింది. వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకూ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్‌తో ఇంతవరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరు అయ్యింది.