కాంటాలగా గాళ్ షెఫాలి జరివాలా 42 వయసులో గుండెపోటుతో మరణించిందనే వార్త షాకిచ్చింది. ఈ మరణానికి కారణం సౌందర్యాన్ని కాపాడుకోవాలనే తపన. వైద్యుల పర్యవేక్షణ లేకుండా యాంటి ఏజింగ్ మందుల వాడకమే గుండెపోటుకు కారణమైందని కథనాలొస్తున్నాయి. ఇప్పుడు వయసును కనిపించనివ్వని మెడిసిన్ గురించి యూత్ లో చాలా చర్చ సాగుతోంది.
షెఫాలి మరణించిన ఒక రోజు తర్వాత మల్లికా షెరావత్ ఒక డీగ్లామ్ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. కృత్రిమ కాస్మెటిక్ ఫిల్లర్లు, బోటాక్స్ వాడకానికి వ్యతిరేకంగా పోస్ట్ ఇది. సరిగ్గా షెఫాలి యాంటీ ఏజింగ్ చికిత్స చేయించుకున్నట్లు కథనాలొచ్చిన సమయంలో మల్లికా క్లిప్ ఆన్ లైన్ లో వైరల్ అయింది. అయితే ఈ సమయంలో షెఫాలీని టార్గెట్ చేయడం సరికాదంటూ మల్లికపై నటి రాఖీ సావంత్ ఫైర్ అయింది.
షెఫాలి జరివాలా ఆకస్మిక మరణం తర్వాత బొటాక్స్ చికిత్సపై వీడియో చేసినందుకు మల్లికా షెరావత్‌ను రాఖీ సావంత్ విమర్శించారు. తాను మేకప్ వేసుకోలేదని, ఫిల్టర్ వేసుకోలేదని, జుట్టు దువ్వుకోలేదని, బోటాక్స్, కృత్రిమ కాస్మెటిక్ ఫిల్లర్లకు నో చెప్పగలిగేలా, ఆరోగ్యకరమైన జీవన విధానానికి అలవాటు పడ్డానని, అందుకే ఈ వీడియోను షేర్ చేశానని మల్లిక వెల్లడించింది. చర్మాన్ని కాంతివంతం చేయడానికి విటమిన్ సి, గ్లూటాథియోన్ లను షెఫాలి ఉపయోగించేదని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో మల్లిక షేర్ చేసిన వీడియో సరికాదంటూ, రాఖీ విరుచుకుపడింది. రాఖీ మల్లికను దూషిస్తూ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది.
బొటాక్స్, ఫిల్లర్స్ అంటూ యూత్ కృత్రిమ పద్ధతులను అనుసరిస్తోంది. దానికంటే శుభ్రంగా తినడం, త్వరగా నిదురించడం, వ్యాయామం చేయడంతో సహజ కాంతిని పొందాలని మల్లిక తన వీడియోలో చెప్పింది. ఇక ఉపవాస సమయంలో షెఫాలి యాంటి ఏజింగ్ ఇంజెక్షన్ చేసుకుందని, దాంతో పాటే ఫుడ్ పాయిజన్ కి గురి కావడం వల్ల కూడా ఈ మరణం సంభవించి ఉండొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. షెఫాలి శవ పరీక్ష ఫలితాలు ఇంకా వెలువడకపోవడంతో ఈ కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. వేలి ముద్రల నిపుణుల నుంచి ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది.