బాలకృష్ణ సరసన `బంగారు బుల్లోడు` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది రవీనా టాండన్. బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా వెలిగిపోతున్న సమయంలోనే రవీనా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఎన్బీకే సరసన బ్లాక్ బస్టర్ సాధించినా కానీ, రవీనా ఆ తర్వాత టాలీవుడ్ లో నటించలేదు. హిందీ చిత్రసీమకే ప్రాధాన్యతను ఇచ్చింది. ఇప్పుడు రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హవా నటరంగంలో మొదలైంది.
రాషా తడానీ `ఆజాద్` అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది రాషా. కానీ తొలి సినిమా ఆశించిన పలితాన్ని ఇవ్వలేదు. అయినా రాషా తడానీ అందచందాలు, డ్యాన్సింగ్ ప్రతిభకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. రాషా మునుముందు టాలీవుడ్ సహా సౌత్ లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ భామకు సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే రాషా తడానీ మాత్రం మరో నాలుగైదు చిత్రాలు బాలీవుడ్ లోనే చేయాలనుకుంటోందట.
తాజాగా `ఆదిపురుష్` విలన్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన ఓ రొమాంటిక్ డ్రామా చిత్రానికి రాషా కమిటైంది. ఇబ్రహీం ఇటీవల నాదనియాన్ అనే ఫ్లాప్ చిత్రంతో డెబ్యూ ఇచ్చాడు. తొలి ప్రయత్నం అతడి నటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అభినయం, డైలాగ్ డెలివరీ బాలేదని విమర్శలొచ్చాయి. అయితే ఇబ్రహీం తనను తాను మెరుగు పరుచుకుంటున్నాడని తెలుస్తోంది. నాదనియాన్ తర్వాత మరో రెండు బాలీవుడ్ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. తదుపరి రాషా తడానీతో కలిసి రొమాంటిక్ డ్రామాలో నటిస్తాడు. ఈ కొత్త జంట ఏమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.