సినీపరిశ్రమలో చిత్రవిచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆర్టిస్టుల జీవితాలు అంత సులువు కాదు. ఇక్కడ వేగంగా ఎదిగేయాలని కలలు కంటే, దానికి ఆరంభంలోనే చాలా చిక్కుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరైన ప్రణాళిక, ప్రతిభ ఉన్నా కానీ, లక్ కలిసి రావాలి. పైగా రంగుల ప్రపంచంలో చాలా మందిని చాలా రకాలుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక నటిగా కెరీర్ పరంగా ఎదగలేక చివరికి డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న నటీనటులను చాలా మందిని చూసాం.
అలాంటి పరాభవాలను ఎదుర్కొన్న ఒకానొక నటి షామా సికందర్. బాలీవుడ్ లో బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి అక్కడ నటిగా అవకాశాలు అందుకోలేక చతికిలబడిన ఈ భామ అప్పట్లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని తాజా పాడ్ కాస్ట్ లో వెల్లడించింది. తాను చాలా నిద్రమాత్రలు మింగానని, చనిపోదామని ప్రయత్నిస్తే బతికించి తప్పు చేసారని కూడా అంది షామా. తాను చాలా కాలం డిప్రెషన్ ని ఎదుర్కొన్నానని, తనకు మానసిక వైద్యులు చికిత్స చేస్తున్న విషయం కూడా తెలియదని వెల్లడించింది.
పరిశ్రమలో తనను అణచివేయాలని ప్రయత్నించిన చాలా మంది పై కోపాన్ని అణగదొక్కడమే డిప్రెషన్ కి కారణమైందని కూడా వెల్లడించింది. తాను సుదీర్ఘ కాలం బైపోలార్ డిజార్డర్ ని ఎదుర్కొన్నానని వెల్లడించింది. మొత్తానికి షామా అనుభవం చూస్తుంటే, ఇది చాలామంది ఔత్సాహిక నటీమణులకు ఎదురయ్యేదే. అయితే కొందరు చాలా సహనంతో ఓపిగ్గా వేచి చూస్తారు.. ఆత్మహత్య వరకూ పరిస్థితిని వెళ్లనీయరు.
17 ఏజ్కే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన షామా 1999లో ఆమిర్ ఖాన్- మనీషా కొయిరాలాతో కలిసి మన్ చిత్రంలో నటించింది. ఇంద్రకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అటుపై పలు క్రేజీ ప్రాజెక్టులు లభించాయి. తరువాత యే మొహబ్బత్ హై, అన్ష్: ది డెడ్లీ పార్ట్, బస్తీ, ధూమ్ దడక్కా, కాంట్రాక్ట్, బైపాస్ రోడ్ సహా మరెన్నో హిట్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతోంది. విదేశీ అయిన ప్రియుడు జేమ్స్ మిల్లిరాన్ తో సుఖమయ జీవితాన్ని ఆస్వాధిస్తోంది.