తెలుగులో పలు హిట్ చిత్రాల్లో విలన్ గా నటించిన ముకుల్ దేవ్ (54) ఆకస్మిక మరణ వార్త సడెన్ గా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అతడి మరణానికి అనారోగ్యం కారణమా లేక ఇంకేదైనా కారణమా? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మీడియా కథనాల ప్రకారం.. అతడు పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. కానీ కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా వివరాలు వెల్లడి కాలేదు.
తాజాగా ముకుల్ దేవ్ సోదరుడే అయిన రాహుల్ దేవ్ అతడి మరణాన్ని అధికారికంగా ధృవీకరించారు. నటుడు రాహుల్ దేవ్ ఇన్ స్టాలో తన సోదరుడు ముకుల్ దేవ్ నిన్న రాత్రి న్యూఢిల్లీలో ప్రశాంతంగా కన్నుమూశారని తెలిపారు. ముకుల్ కుమార్తె సియా దేవ్, సోదరి రష్మి కౌశల్, సోదరుడు రాహుల్ దేవ్, మేనల్లుడు సిద్ధాంత్ దేవ్‌లను విడిచిపెట్టి వెళ్లారని ఆవేదనగా తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరిగే అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. అన్నదమ్ములు రాహుల్ దేవ్, ముకుల్ దేవ్ పలు తెలుగు చిత్రాల్లో నటించారు. మహేష్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి పెద్ద హీరోల చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు పోషించారు. ముకుల్ దేవ్ మరణంపై పరిశ్రమ సహచరులు సంతాపం ప్రకటించారు.