కొద్దిరోజులుగా విదేశీ ప్రియురాలు సోఫీ షైన్‌తో సెలబ్రేషన్ లో మునిగి తేల్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్. గత ఏడాది క్రికెట్ అన్ని ఫార్మాట్‌ల నుంచి వైదొలిగిన ధావన్, ప్రస్తుతం విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఒక అంచనా ప్రకారం.. ధావన్ నికర ఆస్తులు 125 కోట్లు పై మాటే. అయితే ఇప్పుడు అతడు దాదాపు 69 కోట్ల పెట్టుబడితో గరుగ్రామ్ లోని లగ్జరీ డిఎల్ఎఫ్ వెంచర్ లో అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. సుమారు 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్ మెంట్ సకల సౌకర్యాల నిలయంగా ఉంటుందని తెలుస్తోంది.
గత ఫిబ్రవరిలో ధావన్ అపార్ట్ మెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. కేవలం స్టాంప్ డ్యూటీ కోసమే 3.28 కోట్లు ఖర్చు చేసాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ అపార్ట్ మెంట్లలో చదరపు అడుగుకు 1.5లక్షలు ఖరీదు ఉంది. ముంబైలోని ఖరీదైన బాబులంతా దీనిలో పెట్టుబడులు పెట్టారు. దాదాపు 150 ఫ్లాట్ లు సేల్ అయ్యాయి.
ఇదే భవంతిలో పెంట్ హౌస్ ఖరీదు 150కోట్లు. ఈ వెంచర్ ని 17 ఎకరాల్లో వృద్ధి చేస్తున్నారు. దీనికోసం వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. వేల కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ధావన్ డీల్ భారతదేశంలో ఖరీదైన డీల్స్ లో ఒకటి అని రియల్ బ్రోకర్లు చెబుతున్నారు.