నేటి అధునాతన ప్రపంచంలో ఒక మనిషికి, ఇంకో మనిషికి మధ్య నమ్మక ద్రోహాలు, విద్రోహాలు, కుట్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. పని చేసే ప్రతి చోటా ఇవన్నీ కామాన్ గా చూసేవే. అలాంటిది అత్యంత ఆకర్షణీయమైన రంగుల ప్రపంచంలో ఇలాంటి సమస్యలు ఉండటం చాలా చాలా సహజం. తాజాగా తన 50వ పుట్టినరోజు ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబు మోషాయ్ నవాజుద్దీన్ ఇండస్ట్రీ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.
బాలీవుడ్‌లో చాలా స్నేహాలు కలుషితమైనవి, స్వార్థపూరితమైనవని, అసలు స్నేహాలే లేవు! అని ఘాటుగా వ్యాఖ్యానించారు నవాజుద్దీన్. ఇక్కడ మంచి స్నేహాలు లేవు. డబ్బు, స్వార్థం కనిపిస్తాయని అన్నారు. నటీనటుల మధ్య నిజమైన స్నేహం ఏదో త్వరగా గుర్తించలేమని కూడా తెలిపారు. ఆర్థికపరమైన లావాదేవీలతో ముడిపడిన స్నేహాలు మాత్రమే చూస్తామని అన్నారు.
అలాగే సినీపరిశ్రమలో అంతగా నైపుణ్యం లేని నటులకు అవకాశాలిస్తారని, దీని కారణంగా సినిమా క్వాలిటీ పడిపోతుందని కూడా నవాజుద్దీన్ వ్యాఖ్యానించారు. ప్రతిభావంతులైన నటులకు అవకాశాలివ్వకుండా, కోటరీలో ఉన్నవారికి అవకాశాలిచ్చే క్లబ్బులు కూడా బాలీవుడ్ లో ఉంటాయని అన్నారు. అలాగే బాలీవుడ్ రీమేక్ కల్చర్ ని నవాజుద్దీన్ తీవ్రంగా విమర్శించారు. తీసిన సినిమాలనే తీస్తారు. రీమేకులు చేస్తారు. సీక్వెల్ లు అంటారు. ఫార్ములాని తిప్పి తీస్తారు. దక్షిణాది సినిమాలను కాపీ చేస్తారు! అని వ్యాఖ్యానించారు.
ఫలానా దక్షిణాది సినిమా చూసి రాయండి అని చెప్పిన సందర్భాలున్నాయని నవాజుద్దీన్ గుర్తు చేసుకున్నారు. అనురాగ్ కశ్యప్ లాంటి ఒరిజినల్ కంటెంట్ సృష్టికర్తలకు ఇలాంటి చోట అవకాశాలు లేవని అన్నారు. ఒరిజినల్ కంటెంట్ ఉన్న సినిమాలను, ఒరిజినాలిటీ, సృజనాత్మకత ఉన్న ఫిలింమేకర్స్ ని బాలీవుడ్ పక్కన పెట్టేసిందని విమర్శించారు. పాత సినిమాలనే తిప్పి తీసేవారే ఇక్కడ రాజ్యమేలుతున్నారని పరోక్షంగా అన్నారు.