బాలీవుడ్ సరైన హిట్టు లేక అల్లాడుతోంది. అజయ్ దేవగన్ రైడ్ బాక్సాఫీస్ వద్ద 100కోట్ల క్లబ్ లో చేరడం, అక్షయ్ కుమార్ కేసరి 2 గురించి పాజిటివ్ టాక్ వినిపించడం కొంత ఉత్సాహం పెంచింది. కానీ ఈ ఫలితం సరిపోదు. నార్త్ లో బాక్సాఫీస్ స్టామినాకు తగ్గట్టు వసూళ్లను పిండే సినిమాలు మరిన్ని రావాల్సి ఉంది. సరిగ్గా అలాంటి దాహం తీర్చేందుకు రెండు హాలీవుడ్ సినిమాలు బరిలో దిగడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ కలెక్షన్లతో షాకిస్తున్నాయి.
ఓవైపు ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ లో `బ్లడ్ లైన్` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. మనిషిని ప్రమాదం ఎట్నుంచి వెంటాడుతుందో ఎవరూ చెప్పలేరు! అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సిరీస్ ఆద్యంతం థ్రిల్స్ తో రక్తి కట్టిస్తుంది. బ్లడ్ లైన్ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అదిరిపోయే సన్నివేశాలతో రక్తి కట్టిస్తోంది. థ్రిల్లర్ జానర్ లో ఈ తరహా సినిమాలు చాలా అరుదు. అందుకే భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాదిన ఫైనల్ డెస్టినేషన్ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 15 కోట్లు వసూలు చేసి ఇప్పుడు 20కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోంది. భారతదేశంలో అంతగా పాపులర్ కాని ఈ సిరీస్ లో తాజా చిత్రం ఇంత పెద్ద వసూళ్లు సాధించడం ఆశ్చర్యపరిచేదే.
మరోవైపు టామ్ క్రూజ్ ఎంఐ 8 సినిమా భారీ యాక్షన్ అడ్వెంచర్ కేటగిరీలో ఈ శనివారం ప్రీమియర్లతో ముందుకు వచ్చింది. మల్టీప్లెక్సులు కిటకిటలాడేంతగా భారీ బుకింగులు నమోదవ్వడంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 20 కోట్ల క్లబ్ లో చేరడం ఆసక్తిని కలిగిస్తోంది. సోమవారం కొంతవరకూ తగ్గినా కానీ మరో రెండు వారాలు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఆడుతుందని అంచనా. భారతదేశం నుంచి 100 కోట్ల వసూలు చేసే స్టామినా ఈ చిత్రానికి ఉంది. గతంలో వచ్చిన ఎంఐ - డెడ్ రికనింగ్ 100 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రం డే వన్ లో 12 కోట్లు వసూలు చేయడం విశేషం.